తిరుపతి సిటీ, మార్చి 11(ప్రభ న్యూస్) : ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గ పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు విషయంలో గత రెండు మూడు రోజులుగా ఒకే ఇంటి నెంబర్ తో ఎక్కువ ఓట్లు వున్నాయని, బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని వివిధ రాజకీయ పార్టీల నుండి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా ఎన్నికల విధుల నుండి సంబంధిత ఉద్యోగులను తొలగించామని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి తెలిపారు.
శనివారం జిల్లా కలెక్టర్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో కలిసి డి ఆర్ ఓ, సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు, తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి, పోలీస్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పై తెలిపిన ఫిర్యాదులు కంప్యూటర్ ఎంట్రీ సమయంలో జరిగిన పొరపాట్లు కారణమని, దరఖాస్తుల్లో వున్న అడ్రస్ లను పరిశీలిస్తే ఆ ఓటర్లు వున్నారని తేలిందని, ఓటరు జాబితాలో డేటా ఎంట్రీలో తప్పులు రావడానికి కారణమైన, ఎన్నికల విధుల్లో ఆరోపణలున్న వారిపై చర్యల్లో భాగంగా తిరుపతి అర్బన్ ఏ ఈ ఆర్ ఓ వెంకట రమణ, డిప్యూటీ కమిషనర్ చంద్ర మౌలీశ్వర్ రెడ్డి, ఆరు మంది బి ఎల్ ఓ లను ఎన్నికల విధులు నుండి తప్పించామని తెలిపారు. గెజిటెడ్ అధికారుల అటెస్టేషన్ సర్టిఫికెట్లు వున్న వాటిని ఓటర్ జాబితాలో ఉంచడం జరిగిందనీ, సదరు ఓటరు తప్ప వేరే వారు దొంగ ఓటు వేయడానికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫిర్యాదుల నేపథ్యంలో తిరుపతిలోని 14 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పరిగణించి వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు, పోలింగ్ స్థానం వెలుపల లోపల వీడియోగ్రఫీ, అదనపు బందోబస్తు ఏర్పాటుతో, ఎ.ఎస్.డి. లిస్టు అందుబాటులో వుంచి, ఓటర్ స్లిప్ తో పాటు, ఐడి ఖచ్చితత్వం రూఢీ చేసుకుని పి.ఓ ఓటింగ్ కు అనుమతి ఇస్తారన్నారు. దొంగ ఓట్లు వేయడానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని, దొంగ ఓటు వేయడానికి వచ్చాడని గుర్తిస్తే వెంటనే కేసు నమోదు, చర్యలు తీవ్రతరంగా ఉంటాయని తెలిపారు.
ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి పోలింగ్ కేంద్రానికి మైక్రో అబ్జర్వర్ లుగా నియమించడం జరిగిందని, పోలి౦గ్ కేంద్రంలో జరిగే విషయాలను నమోదు చేసుకుని నేరుగా ఎన్నికల కమిషన్ నియమించిన పరిశీలకులకు అందిస్తారన్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానాలు, భయాందోళనలకు తావు లేకుండా ఈ నెల 13న ప్రశా౦తంగా ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహించేలా చర్యలు ఉండాలన్నారు. పోలింగ్ స్థానాల్లో ఆక్జిలరి పోలింగ్ కేంద్రాలు ఓటర్ల వివరాలు, ఓటు విధానం తెలిసేలా బ్యానర్ ఏర్పాటు ఉండాలని సూచించారు. జిల్లాలోని నాలుగు డివిజన్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ అందుబాటులో ఉంచామని, రేపు 12వ తేదీన పి.ఓ., ఎ.పి.ఓ.లకు అందించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలింగ్ స్థానం వద్ద పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు తనిఖీలు చేపట్టి ఓటర్ స్లీప్, గుర్తింపు నిర్ధారణ పత్రం మినహా సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సామాగ్రి పోలింగ్ కేంద్రంలోకి అనుమతించ కూడదని, తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా బ్యారికేడింగ్ ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి ఆర్డీఓ కనక నరస రెడ్డి, అదనపు ఎస్పీ వెంకట్రావు, కులశేఖర్, విమలకుమారి ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.