Friday, November 8, 2024

న్యాయవాదికి రూ.96 లక్షల ఫీజా?

సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డికి రూ.96 లక్షలు ఫీజుగా చెల్లించేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ ఈ ఏడాది మే 24న ప్రభుత్వం జారీ చేసిన జీవో 239 సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఏపీ న్యాయవాదుల రుసుముల నిబంధన-43 ఉల్లంఘించేదిగా ఆ జీవో ఉందని..హైకోర్టు న్యాయవాది చింతల విజయ్‌కుమార్‌ తరఫున న్యాయవాది వై.కమలారాణి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ జీవో చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, కొట్టేయాలని కోరారు అందులో పేర్కొన్నారు..

పురపాలక పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ(ఏఎంఆర్డీఏ) కమిషనర్‌, అడ్వొకేట్‌ జనరల్‌తో పాటు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఖర్చుచేసే రూ.96 లక్షలకు ప్రతివాదులను బాధ్యులుగా ప్రకటించాలన్నారు. వారి నుంచి సొమ్మును రాబట్టాలన్నారు. రాజధానిని అమరావతి నుంచి మార్చే శాసనాధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌, హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినందుకు సీనియర్‌ న్యాయవాది రుసుము కింద రూ.96 లక్షలు చెల్లింపునకు జీవో ఇచ్చారన్నారు. ఇందులో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ విచారణకు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి హాజరు కాలేదని పిటిషనరు పేర్కొన్నారు. తక్కువ రుసుముకు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఈనెల 10న వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement