- నయవంచకుడిగా మారిన ప్రియుడు
- ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీసి బెదిరింపులు
- ప్రియుడి స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారం
- వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం
- ఆమె ప్రయత్నాన్ని నిలువరించిన తండ్రి
- ఆమెకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు
- ఘటన పై సీపీ సీరియస్
విశాఖ క్రైం, ఆంధ్రప్రభ న్యూస్ : ప్రియుడే నయవంచకుడిగా మారాడు. ప్రియురాలిపై తన ఫ్రెండ్స్ తో అత్యాచారం చేయించాడు. గ్యాంగ్ రేప్ తో ఆమె అవమానభారంతో కృంగిపోయింది. ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలను చూపించి ఆమెను బెదిరించి మళ్ళీ తమ కోర్కెను తీర్చమని చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన తండ్రి ఆమె ప్రయత్నాన్ని నిలువరించి విషయం అడుగగా ఆమె జరిగిందంతా చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జోన్ 2 ప్రాంతానికి చెందిన లా విద్యార్థిని తనతో పాటు చదువుతున్న మరో వ్యక్తి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. తర్వాత దాబా గార్డెన్స్ వద్దకు ఆమెను రప్పించి తన ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్లి బలవంతంగా ఆమెతో శారీరకంగా కలిసాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రియుడి స్నేహితులు ముగ్గురు ఆమెను బలవంతం చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దీంతో ఆమె అవమాన భారంతో కృంగిపోయింది. ప్రియుడే దగ్గరుండి అతని ఫ్రెండ్స్ తో మూకుమ్మడిగా అత్యాచారం చేయించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తన ప్రియుడిని నిలదీసి అడిగినా అతను కూడా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు.
ఆ తర్వాత కూడా అతని స్నేహితులు ఆమెను బెదిరించి తమ వద్దకు రమ్మని చెప్పేవారు. ఆమెతో కలిసినప్పుడు తీసిన వీడియోలను బయట పెడతామని ఆమెను బెదిరించేవారు. వారి వేధింపులకు తాళలేక ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అది గమనించిన తండ్రి ఆమె ప్రయత్నాన్ని నిలువరించి అసలు విషయం అడగడంతో ఆమె జరిగిందంతా చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగింది టూ టౌన్ లిమిట్స్ లో కావడంతో ఆ పోలీస్ స్టేషన్ కి రెఫర్ చేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు టూ టౌన్ సిఐకి, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుల్లో ముగ్గురు లా స్టూడెంట్స్ కాగా, మరో నిందితుడు వరుణ్ మోటర్స్ లో క్యాషియర్ గా పని చేస్తున్నాడు.