రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంతిమయాత్ర మొదలైంది. ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం నుంచి స్మృతివనం వరకూ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, రామోజీ సంస్థల ఉద్యోగులు ఆయన పార్థివదేహం వెంట నడుస్తున్నారు. రామోజీరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీస్ బ్యాండ్ తో పాటు సిబ్బంది ముందు నడవగా.. పూలరథంలో రామోజీ పార్థివదేహాన్ని ఉంచి స్మృతివనానికి తీసుకు వచ్చారు.
పాడె మోసిన చంద్రబాబు ..
రామోజీరావు అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. రామోజీ నివాసం నుంచి సాగిన యాత్రలో పాల్గొని పాడె మోశారు. స్మృతివనం వద్ద రామోజీకి కడసారి వీడ్కోలు పలికారు. పూలతో రామోజీ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
మరికాసేపట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తికానున్నాయి. స్మారక కట్టడం వద్దకు రామోజీ అభిమానులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది భారీగా చేరుకున్నారు. తెలంగాణ మంత్రి తుమ్మల, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావులతో పాటు సినీ ప్రముఖులు బోయపాటి శ్రీను, సురేశ్ బాబు తదితరులు రామోజీ అంత్యక్రియలకు హాజరయ్యారు.