Sunday, November 17, 2024

Last Punch – చివ‌రి మీటింగ్ లో జ‌గ‌న్ దుమ్ముదులిపేసిన చంద్ర‌బాబు

చిత్తూరు – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో తన చివరి ప్రచార సభను చిత్తూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు చదువుకున్న వ్యక్తి. ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా పనిచేసి సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు.

చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జగన్ మోహన్ పోటీ చేస్తున్నారు… తక్కువ సమయంలో బుల్లెట్ మాదిరి దూసుకుపోయాడని కొనియాడారు. చిత్తూరులో గెలుపు జగన్ మోహన్ దేనని ధీమా వ్యక్తం చేశారు. మొదట్లో తనకు సందేహం కలిగిందని, మనవాడు ముందుకు పోగలడా అనుకున్నానని, కానీ పేరును అనౌన్స్ చేశాక అందరినీ కలుపుకుని కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైపోయాడని అభినందించారు. కౌరవ వధ తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇక్కడ ఎలాంటి బ్రహ్మాండమైన నాయకుడ్ని పెట్టాడో తర్వాత మాట్లాడతానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు టీడీపీ అభ్యర్థి, తిరుపతి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

- Advertisement -

సీనియర్ నేత సీకే బాబు గురించి చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు చిత్తూరులో తనకంటూ ప్రత్యేకత ఉందని అన్నారు. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం అని హెచ్చరించారు. చిత్తూరు నుంచి జగన్ మోహన్ ను గెలిపిస్తానని ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చిన వ్యక్తి సీకే బాబు అని కొనియాడారు.
“ఇది నా జిల్లా. నేను పుట్టిన జిల్లా. ఎన్నికల కోసం రాష్ట్రమంతా తిరిగా… చివరి మీటింగ్ ను ఇక్కడే పెట్టాలని అనుకున్నా. రాష్ట్రం మొత్తానికి నేను చెప్పాలనుకున్నది ఇక్కడ్నించే చెబుతాను. నాకు రాజకీయ జన్మనిచ్చిన జిల్లా ఇది, రాజకీయాల్లో ఓనమాలు నేర్పించిన జిల్లా ఇది. చిత్తూరు జిల్లా ప్రజల గౌరవాన్ని కాపాడేందుకు అనునిత్యం పనిచేశాను.

ఇవాళ నంద్యాలలో కూడా మీటింగ్ పెట్టాను. నన్ను ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడ మీటింగ్ పెట్టాను. ఏ తప్పు చేయని నన్ను అరెస్ట్ చేశారు. నాకే ఈ పరిస్థితి వస్తే, సామాన్యుల పరిస్థితేంటి? అందుకే సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ జిల్లాలో ఎవర్ని చూసినా నేను గుర్తుపట్టగలను. మీ రుణం తీర్చుకుంటా.
జిల్లాలో పరిశ్రమలు పెట్టించాను, సాగునీరు అందించేందుకు కృషి చేశాను. ఈ జిల్లా వాసులను అగ్రస్థానంలో నిలిపేందుకు నా జీవితాంతం పనిచేశాను. చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు రావాలని తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చాం. ఎక్కడైనా అభివృద్ధికి మారుపేరు టీడీపీ… అవినీతికి మారుపేరు సైకో పాలన!

ఇక్కడ రోడ్లు ఎవరి వల్ల వచ్చాయి? నేను మొదట మలేషియాలో రోడ్లు చూసి, మనదేశంలోనూ మంచి రోడ్లు ఉండాలని నాటి ప్రధాని వాజ్ పేయికి చెప్పి తొలిరోడ్డు నెల్లూరు నుంచి చెన్నైకి వేసేలా కృషి చేశాను. ఇప్పుడు దేశమంతా ఎక్స్ ప్రెస్ లేన్ రోడ్లు వచ్చాయంటే అది టీడీపీ వల్లే. మీరందరూ వాడే సెల్ ఫోన్లు తీసుకురావడానికి నేనే కారణం. గత 30 ఏళ్లుగా టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు సెల్ ఫోన్ తిండిపెడుతుందా అని నన్ను ఎగతాళి చేశారు. ఇప్పడు భర్త లేకుండా భార్య ఉంటుంది, భార్య లేకపోయినా భర్త ఉంటాడు కానీ సెల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండలేరు. ఇప్పుడు పేదవాళ్ల దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి.

ఇవన్నీ ఉంటే సరిపోదు… సాగునీరు కూడా ఉండాలి. సాగునీటి ప్రాధాన్యతను గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుగంగ, నగరి-గాలేరు, హంద్రీనీవా… ఇవన్నీ ఎన్టీఆర్ ఆలోచనలే. నేనొచ్చిన తర్వాత రూ.65 వేల కోట్లతో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను.
నిన్నా మొన్నా వచ్చాడు… సినిమా సెట్టింగులు గాడు… ముఖ్యమంత్రి! నేరుగా కుప్పం పోయాడు, గేట్లు పెట్టాడు, ట్యాంకర్లలో నీళ్లు తెచ్చి పోసి గేట్లు ఓపెన్ చేశారు. ఈయన విమానం ఎక్కి వెళ్లిపోయాడు… నీళ్లు ఆరిపోయాయి, గేట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఇదేనా అభివృద్ధి? ఇలాంటి మోసకారి మనకు అవసరమా?

నేను అధికారంలోకి రాగానే చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా. ఇవాళ నంద్యాలలో కూడా చెప్పా… నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఈ గడ్డమీదనే పుట్టా. ఇప్పుడు సవాల్ విసురుతున్నా… రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించడానికి సిద్ధమా? గత ఎన్నికల్లో రాయలసీమలో 52 సీట్లలో 3 సీట్లే మాకు వచ్చాయి… వైసీపీని 49 సీట్లలో గెలిపించారు. మరి ఏమైనా చేశాడా? సాగునీరు తెచ్చాడా? కాలేజీలు తెచ్చాడా? రోడ్లు వేశాడా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా?
పాదయాత్ర చేసి ఒక్క చాన్స్ అన్నాడు. ప్రజలు ఐస్ మాదిరిగా కరిగిపోయారు. 151 సీట్లలో గెలిచేసరికి కొవ్వెక్కి, కళ్లు నెత్తికెక్కాయి. ఎదురుమాట్లాడితే వాళ్లపై దాడులు, కేసులు! పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. చిత్తూరు జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుంటే, ఇక్కడికి ప్రజలకు నేను భరోసా ఇవ్వాలనుకున్నాను. కానీ, నన్ను ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపించారు. మర్చిపోతానా ఇవన్నీ? నాకు రోషం లేదనుకుంటున్నారా? నేను తలుచుకుంటే మీరు రోడ్ల మీదకు కూడా రాలేరు.

ఇక్కడొకాయన ఉన్నాడు… పాపాల పెద్దిరెడ్డి. ఈ జిల్లాలో చూస్తే పదవులన్నీ ఆయనకే కావాలి. ఎంపీ ఆయన కొడుకే, ఎమ్మెల్యే ఆయన తమ్ముడే, మంత్రి పదవి ఆయనకే, కాంట్రాక్టులన్నీ ఆయనకే. ఇరిగేషన్ కాంట్రాక్టులు కూడా ఈయనకే. ఈ రాష్ట్రం వీళ్లబ్బ సొమ్ము అనుకుంటున్నారు. మెక్కిందంతా మక్కెలు విరగ్గొట్టి వసూలు చేస్తా, పేదల కోసం ఖర్చు చేస్తా.
ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎర్రచందనం స్మగ్లర్… జైల్లో ఉండాల్సిన వ్యక్తి. నేను అనుకుంటే ఎప్పుడో ఎక్కడికో పోయేవాడు… ఏం తమాషా అనుకుంటున్నావా, ఇక్కడ అందరినీ బెదిరిస్తావా?

ఈ ఐదేళ్లలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలంతా ఆలోచించాలి.జరిగిన దానికి కసి తీర్చుకోవాలని ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోంది. గత 40 రోజులుగా నేను ప్రచారం చేస్తున్నాను… ఇది 89వ సభ. ఎవరూ ఇన్ని సభలు చేసి ఉండరు. ఎక్కడి చూసినా ఇదే స్పందన, ఇదే ఉత్సాహం చూస్తున్నా. యువత, మహిళలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు అందరూ రోడ్లపైకి వచ్చారు.

జగన్ పాలనలో బాగుపడింది ఐదుగురే. పాపాల పెద్దిరెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, జగన్ మోహన్ రెడ్డి…. వీళ్లు తప్ప ఎవరైనా బాగుపడ్డారా? రైతుల్లో రెడ్లు, కమ్మవాళ్లు, బలిజలు అందరూ ఉన్నారు… ఎవరైనా బాగుపడ్డారా? జగన్ దోపిడీకి అందరూ బలైపోయారు.

అందుకే నేను, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందుకొచ్చాం. పవన్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో. ప్రజలను ఆదుకోవాలని ముందుకు రావడమే కాదు, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడ్డాడు. నేను, ఆయన బీజేపీ ముగ్గురం కలిశాం. ప్రజలు గెలవాలని, రాష్ట్రం వెలగాలని కలిశాం. నేను జైల్లో ఉంటే వచ్చి, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి, పొత్తు పెట్టుకుంటున్నాం అని ప్రకటించిన వ్యక్తి పవన్ కల్యాణ్” అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement