Thursday, November 21, 2024

కొత్త జిల్లాలపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు.. ప్రజల్లో వ్యతిరేకత

కృష్ణా, ప్రభన్యూస్ : పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కృష్ణాజిల్లాను రెండు జిల్లాలుగా విభజన చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, సూచనలను ఉంటే ఈ నెల 26వ తేదీ జిల్లా కలెక్టర్‌కు అందజేయాల్సి ఉంది. జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. నైసర్గిక స్వరూపం, జిల్లా పేర్ల ఏర్పాటుపై పెద్ద ఎత్తున కలెక్టర్‌కు అర్జీలు అందుతున్నాయి. అయితే మార్పులు, చేర్పులు చేసినట్లయితే జిల్లాల సమతుల్యం దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. జనాభా, ఆర్థిక, సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని, ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు ఏ మేరకు పరిష్కారమవుతాయో అనేది వేచి చూడాల్సి ఉంది. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిని జిల్లాగా ప్రకటించారు.

దీంతో మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాగాను, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లాగా ప్రకటించింది. మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, పెనమలూరు, గన్నవరం శాసనసభ నియోజకవర్గాలు కృష్ణాజిల్లాగా ప్రకటించారు. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని విజయవాడ తూర్పు, సెంట్రల్‌, పశ్చిమ, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు శాసనసభ నియోజకవర్గాలను కలిపి విజయవాడ నియోజకవర్గంగా ప్రకటించారు. అయితే మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్న విజయవాడ రూరల్‌ పరిధిలోని తొమ్మిది గ్రామాల పరిస్థితిపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిపారు. విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో 22.19 లక్షలు, మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో 17.25 లక్షలు జనాభా ఉంది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలో కలిపితే జిల్లాల మధ్య జనాభా వ్యత్యాసం భారీగా ఉంటుంది. కొత్త కృష్ణాజిల్లాలో కలిపిన గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు విజయవాడ అంతర్భంగా ఉన్నాయి. దీంతో గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలలో అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని తమ నియోజకవర్గాన్ని విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలనే డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై దశలవారీ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విజయవాడ పేరుతో గన్నవరంలో విమానాశ్రయం ఉంది. అలాగే గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు విజయవాడకు కలిసి పోయి ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు అన్ని విజయవాడతో ఎక్కువగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రకటిత కృష్ణాజిల్లాలో కలపడం వల్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఏర్పడే ఎన్టీఆర్‌ జిల్లాలో కలపకపోతే భవిష్యత్‌లో ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి ఉంది. అలాగే నూజివీడు నియోజకవర్గాన్ని కూడా ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలంటూ ఆందోళన చేపట్టారు. లేనిపక్షంలో నూజివీడు కేంద్రంగా ఎం.ఆర్‌. అప్పారావు జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తెరపైకి తీసుకువచ్చారు. అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని మచిలీపట్నంలో కలపాలని కొంత మంది డిమాండ్‌ చేస్తుంటే మరికొంత మంది ఏలూరు జిల్లాలో కలిపినే అభ్యంతరం లేదని చెబుతున్నారు. అలాగే రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా ఆందోళన నెలకొంది. దివిసీమకు కేంద్ర బిందువైన అవనిగడ్డ కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే జిల్లా పేర్లపై రగడ నెలకొంది. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాగాను, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లాగా ప్రకటించారు. అయితే ఎన్టీఆర్‌ పుట్టిన నిమ్మకూరు కృష్ణాజిల్లాలో ఉందని ,దానికి ఎన్టీఆర్‌ పేరు నమకరణ చేయాలని, అలాగే విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఆదే సమయంలో కృష్ణాజిల్లాకు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు నామకరణ చేయాలనే డిమాండ్‌ కూడా ఉంది. జిల్లా పేర్ల మార్పు విషయంలో పెద్ద ఎత్తున అర్జీలు అందజేస్తున్నారు. జిల్లా నామకరణ విషయంలో ప్రభుత్వానికి, అధికార పార్టీకి కొంత మేర తలనొప్పిగా మారే అవకాశం ఉందంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement