(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) – సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. అసాంఘిక శక్తులు, అక్రమ మద్యం రవాణా వంటి వాటిపై డేగ కన్ను పెట్టిన పోలీసులు, తనిఖీలు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న మద్యం నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మర గస్తీ నిర్వహించి పెద్ద ఎత్తున నాన్ డి పి ఎల్ మద్యం, అక్రమ రవాణా చేస్తున్న నగదు స్వాధీనం చేసుకున్నారు.
వీటి వివరాలను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా బుధవారం సాయంత్రం విలేకరులకు వివరించారు. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా మాట్లాడుతూ డీపీఎల్ , నాన్ డీపీఎల్ , ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం అన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ, హర్యానా నుండి దిగుమతి చేసుకోని, ఇక్కడ అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండిని కూడా స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. షుమారు 90 లక్షల నాన్ డీపీఎల్, ఐడి లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రూ కోటి 83 లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నం అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో 24 గంటల పాటు ముమ్మర గస్తీలు, చెక్ పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.