న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలోని వివిధ పోర్టుల్లో భారీ సంఖ్యలో ఖాళీలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 11 మేజర్ పోర్టులలో 10,208 పోస్టులు ఖాళీలున్నాయని, ఇందులో విశాఖ పోర్టులో 982 ఖాళీలున్నాయని రాజ్యసభలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, యాంత్రీకరణ కారణంగా ఇప్పుడున్న సిబ్బంది సంఖ్యే అవసరాన్ని మించి ఉన్నట్టు గుర్తింంచామన్నారు. దీంతో ప్రైవేటు పోర్టులతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వ రంగ పోర్టుల నిర్వహణా వ్యయం బాగా పెరిగిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని పోర్టులలో ఎంతమేర సిబ్బంది అవసరమనే విషయంపై అధ్యయనం చేయడానికి ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ KPMG సంస్థకు బాధ్యతలు అప్పగించిందని ఆయన వెల్లడించారు.
పోర్టులపై కోవిడ్ ప్రభావం
కోవిడ్ ప్రభావం కారణంగా విశాఖపట్నం పోర్టుతో సహా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర పోర్టులలో కార్గో హ్యాండ్లింగ్ పరిణామం తగ్గిందని కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతర్జాతీయంగా ఎగుమతులు, దిగుమతులపై కోవిడ్ మహమ్మారి ప్రభావం పడిందని, ఫలితంగా 2020-21లో ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ మేజర్ పోర్టుతోపాటు గంగవరం పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులలో సైతం కార్గో హ్యాండ్లింగ్ వాటి పూర్తి సామర్ధ్యాని కంటే చాలా తక్కువగా జరిగిందని తెలిపారు. విశాఖపట్నం మేజర్ పోర్టు తమ మంత్రిత్వ శాఖ అధీనంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పీపీపీ పద్దతిలో ఏర్పాటైన గంగంవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలోని మారిటైమ్ బోర్డు కింద పనిచేస్తున్నట్లు మంత్రి చెప్పారు. విశాఖపట్నంతో సహా తమ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న అన్ని మేజర్ పోర్టులలో బెర్తులు, టెర్మినల్స్ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం పోర్టులోని అయిదు బెర్తుల్లో పీపీపీ పద్దతిపై కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ పోర్టులో కార్గో హ్యాండ్లింగ్‌కు సంబంధించి అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇక నాన్ మేజర్ పోర్టులు సైతం వాటి సామర్ధ్యానికంటే తక్కువగానే కార్గో హ్యాండ్లింగ్ నిర్వహించాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ మోడల్‌పై రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంతోపాటు కాకినాడలో కేఎస్‌ఈజెడ్ పోర్టును నాన్ మేజర్ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..