Wednesday, November 20, 2024

బొల్లాపల్లి భూ అక్రమాలపై విచారణ చేప‌ట్టాలి..టిడిపి అధ్య‌క్షులు..

బొల్లాపల్లి మండలంలోని భూముల అక్రమాలపై సిబిఐ తో విచారణ జరపాలని నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. వినుకొండలోని తన కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బొల్లాపల్లి మండలంలో అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలు ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఒక్కొక్క పాస్ పుస్తకానికి పది వేల రూపాయల చొప్పున.. ఏడు వేలకు పైగా పాసు పుస్తకాలు మంజూరు చేశారని అన్నారు. చుక్కల భూములు, పోరంబోకు ప్రభుత్వ భూములను అడ్డగోలుగా తనకు కావలసిన వారికి ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఈపాస్ పుస్తకాలతో బ్యాంకులను కూడా మోసం చేసి లోన్ ల రూపంలో డబ్బులు కాజేశారు అన్నారు. బొల్లాపల్లి మండలంలో అటవీ భూములకు కూడా పాసుపుస్తకాలు ఇచ్చారు అని చెప్పారు.

ఈ మండలంలో పేదలైన ఎస్సీ.. ఎస్టీలు అధికంగా నివసిస్తున్నారని వివరించారు. పేద రైతుల దగ్గర పాసుపుస్తకాలకు వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ రంగనాథ్ రాజ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇల్లు.. కాలనీలు ఆయనకు కనిపించకపోవడం విడ్డూరమని అన్నారు. వినుకొండకు వస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన కాలనీలను చూపిస్తామన్నారు. టిడిపి ప్రభుత్వం 5 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిందని అన్నారు. పట్టణాలలో పేదలకు కాలనీలు నిర్మించి మహానగరాలుగా మార్చామని అన్నారు.

ఈ ప్రభుత్వం పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో సెంటు భూమి ఇచ్చి పేదలను దగా చేశారని విమర్శించారు. ఈ భూ పంపిణీలో ఎమ్మెల్యే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు.త‌నే కాదు త‌న కుటుంబ సభ్యులైన బావ మరదలు అయినా గాని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. బొల్లాపల్లి భూ అక్రమాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement