Friday, November 22, 2024

సాంబార్, ఉలువ‌చారుల‌కు ల‌క్ష‌ల‌లో బిల్లులు – దుబారాపై జ‌గ‌న్ ఆగ్ర‌హం..

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ శాఖల్లో దుబారా ఖర్చు మితిమీరుతోందని ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.. కొందరు మంత్రులు, ఉన్నతాధికారుల క్యాంప్‌ కార్యాలయాలు.. సమావేశాలు.. కార్యక్రమా ల నిర్వహణ నిమిత్తం స్టార్‌ హోటళ్లకు లక్షలాది రూపాయల బిల్లులు చెల్లించాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పర్యటనల సందర్భంగా లేని ఖర్చు సాదాసీదా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నా రనే ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కూడా సీరియస్‌గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు నియంత్రించుకోవాలని శాఖల వారీగా సమీక్షా సమావేశాల సందర్భంగా సీఎం జగన్‌ మౌఖికంగా అధికారులను ఆదేశిస్తున్నారు. అయినా కొన్ని శాఖల్లో పరిమితికి మించి విచ్చలవిడిగా ఖర్చు జరుగుతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి.. అభివృద్ధి పనులకే పూర్తి స్థాయిలో నిధులు అందుబాటులోలేని పరిస్థితుల్లో ఆడంబరాలకు చేస్తున్న ఖర్చుకు ఇకపై చెక్‌ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.. స్వయంగా ముఖ్యమంత్రి ఇటీవల సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక శాఖకు తగిన సూచనలిచ్చినట్లు తెలియవచ్చింది.. వృథా ఖర్చులపై ఆర్థిక శాఖ సైతం అసహనం వ్యక్తం చేస్తోంది.. ప్రభుత్వ పరంగా ఆయా శాఖలకు సొంత కార్యాలయ భవనాలు ఉన్నా ఒక గంటలో ముగించే కార్యక్రమాలను సైతం స్టార్‌ హోటళ్లలో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఒకరోజు స్టార్‌ హోటల్‌లో సమావేశాలు నిర్వహిస్తే దాదాపు అరకోటి చెల్లించాల్సి వస్తుందని చెప్తున్నారు.. సాధారణంగా అధికారులతో ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలన్నీ క్యాంప్‌ కార్యాలయంలో జరుగుతాయి.. అయితే శాఖల్లో అవగాహన కార్యక్రమాలు.. రీ సర్వే.. పరీక్షా ఫలితాల విడుదల..వైద్యశాఖ, రైతులకు సంబంధించిన కార్యక్రమాలేవైనా ఉంటే అందుకు వేదికలు అందుబాటులో ఉన్నాయి.

. అయితే ఇటీవల మత్స్యశాఖ నిర్వహించిన సమావేశానికి కూడా విచ్చలవిడిగా ఖర్చు చేయటాన్ని ముఖ్యమంత్రి సైతం తప్పుపట్టినట్లు చెబుతున్నారు. కొందరు అధికారుల నిర్వాకంతో ఒక్కో సమావేశానికి లక్షల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోందని ఇకపై చెల్లింపులు జరపలేమని ఆర్థికశాఖ చేతులెత్తేస్తున్నట్లు తెలిసింది. అన్నింటికీ మించి రాష్ట్ర సచివాలయంలో జరిగే సమావేశాలకూ, కార్యక్రమాలకు రిఫ్రెష్‌మెం ట్‌,లంచ్‌ను స్టార్‌ హోటళ్ల నుంచే ఖరీదైన తినుబండారాలు తెప్పిస్తున్నారని చివరకు సాంబారు, ఉలవచారుకు కూడా వేలాది రూపాయల ఖర్చు జరుగుతోందని నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిసింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరిగే సమావేశాలకు సైతం ఇంతగా ఖర్చుకాదని ఓ అధికారి వ్యాఖ్యానించటం కొసమెరుపు.. తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్ర బిందువుగా విజయవాడ, గుంటూరులో రాష్ట్ర హెచ్‌ఓడీల విభాగాలు ఏర్పాటయ్యాయి.. గత ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనం ఖర్చయిందని మనం ఆరోపిస్తున్నాం.. ఇలాంటి పరిస్థితుల్లో మనం నిబద్దతతో వ్యవహరించాలి.. ఖర్చులు తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి పదేపదే సూచిస్తున్నా పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి.. ప్రభుత్వ సొంత భవనాల్లో తరచు మరమ్మత్తులు, విస్తరణ పనులకు లక్షల్లో బిల్లులు చెల్లిస్తున్నారు.. గుంటూరులోని వ్యవసాయ, మార్కెటింగ్‌ విభాగానికి సొంత భవనాలు ఉన్నాయి..అయితే మార్కెటింగ్‌ శాఖ భవనంలో విస్తరణ పనుల పేరిట రెండు కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.. అంతేకాదు విజయవాడలో కొందరు బ్యూరోక్రాట్ల నివాసాలకు ఇంటీరియర్‌ డెకరేషన్ల పేరిట పెద్దఎత్తున బిల్లులు వస్తున్నట్లు చెబుతున్నారు… అదే తరహాలో ఏలూరులో కోట్లాది రూపాయలతో ఆర్థికశాఖ కార్యాలయ భవనాలు నిర్మించనున్నారు.. పాలనా రాజధాని విశాఖపట్టణం తరలించే యోచనలో ప్రభుత్వం ఉంటే తాత్కాలిక అవసరాలకు భారీగా చెల్లింపులు జరపటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది..

ఇకపై ప్రభుత్వ పరీక్షల ఫలితాలు విడుదల.. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రె స్‌మీట్లు, ఇతర అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాపులు అన్నీ స్టార్‌ హోటళ్లలో కాకుండా ఆయా విభాగాల సొంత భవనాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా చాలీచాలని భవనాల్లో కాలక్షేపం చేస్తుంటే మరోవైపు రాష్ట్ర హెడ్‌క్వార్టర్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.. దీంతో మొత్తం వృథా ఖర్చుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. కార్యాలయాలకు భవనాలు ఎన్ని ఉన్నాయి.. వాహనాలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి? నిర్వహణకు ఏ మేరకు చెల్లింపులు జరుగుతున్నాయనేది ఆరా తీస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement