Monday, November 25, 2024

తాగునీటికి నిధుల కొరత..నీటి సరఫరాకు ఆటంకం..

క‌ర్నూలు జిల్లాలో తాగునీటి పథకాలకు నిధుల కొరత నెలకొంది. దీంతో ఆయా గ్రామాలకు నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడి ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. జెడ్పి పరిధిలో సిపిడబ్ల్యుఎస్‌ఈ పథకాలు 57 ఉండగా వీటి ద్వారా సుమారు 682 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. వీటి నిర్వహణకు ప్రతి ఏడాది రూ.60కోట్లు కేటాయించనుండగా, గత 24 మాసాలుగా నిధులు మంజూరు చేయలేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు జిల్లాలో ఇప్పటికే ఎండలు మండిపోతుండటంతో పల్లెల్లో తాగునీటి కేకలు మొదలయ్యాయి. తాగునీటి పథకాలు ఉన్నా నిధులు లేక నిర్వహణతో నీరుగారుతున్నాయి. గత ఏడాది మంచినీటి ఎద్దడి నివారణకు రూ.3కోట్లు 2019-20 సంవత్సరంలో రూ.20కోట్లు, 2018-19లో రూ16కోట్లు పనులకు ప్రతిపాదనలు చేశారు. ఈ ఏడాది రూ.3కోట్లలోపే ప్రణాళికలు రూపొందించారు. రెండేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

వేసవిలో నీటి ఎద్దడి అధిగమించడానికి గత ఏడాది కొన్ని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయగా, వాటి బిల్లులు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో రూ.2.54కోట్లు, 2021-22 ట్యాంకర్ల సరఫరాకు సంబంధించి రూ.4లక్షలకు బిల్లులు ఇంకా మంజూరు కాలేదు. హాలహర్వి మండలంలో 29 గ్రామాలకు మంచినీరు అందించే పథకం నిర్వహణ లేక అటకెక్కింది. ఆస్పరి మడల పరిధిలోని రెండు గ్రామాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు నియోజకవర్గంలోని ఆలూరు నియోజకవర్గంలో నాలుగు రోజులకోసారి మంచినీరు సరఫరా చేస్తున్నారు. రార్బన్‌ పథకం కింద రూ.3లక్షలతో బాపురం నుండి ఆలూరుకు ప్రత్యేకంగా పైపులైన్‌ వేసినా క్షేత్రస్థాయిలో పనులు మిగిలిపోయాయి. ఈ పథకానికి ఇప్పటికే రూ.70లక్షలు పెండింగ్‌లో ఉంది. పది మాసాలుగా కార్మికులకు ఇవ్వకపోవడంతో ఇప్పటికే రెండుసార్లు ధర్నా నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల్లో సిపిడబ్ల్యుఎస్‌ పథకాలు పనిచేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాలలో నాలుగైదు రోజులకోసారి మంచినీరు సరఫరా అవుతుం డగా మరికొన్ని గ్రామాలలో శుద్ధిచేయక పోవడంతో కలుషిత నీరే ప్రజలు తాగుతున్నారు. ఇప్పటికైనా సిపిడబ్ల్యుఎస్‌ పథకాలకు పెండింగ్‌లో ఉన్న నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement