Friday, November 22, 2024

హాస్టళ్లలో ఫెసిలిటీస్ లేవ్.. స్టడీ కొనసాగేది ఎట్లా..?

గుమ్మలక్ష్మీపురం, (ప్రభ న్యూస్‌) : మండలంలో భద్రగిరిలో ఏర్పాటు చేసిన ఆర్‌ఐటీఐ శిక్షణ కేంద్రంలో సమస్యలు కొలువు దీరడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, చదువులు సాగిస్తున్నారు. విద్యార్ధులు స్థానికంగా ఉండి చదువుకునేందుకు వీలుగా వసతి గృహాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, విద్యార్ధులకు భోజన సౌకర్యం మాత్రం లేకపోవడంతో విద్యపట్ల విద్యార్ధులు మక్కువ చూపకపోవడంతో క్రమక్రమంగా ఆర్‌ఐటీఐలో చేరిక సంఖ్య తగ్గు ముఖంపట్టింది. గత 20 ఏళ్ల కిందట ఐటీఐ ప్రారంభంలో అన్ని రకాల వసతులు విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండడంతో, దూరదూర ప్రాంతాల నుంచి విద్యార్ధులు వందల సంఖ్యలో వచ్చి చేరేవారు.

రానురాను ఐటీఐ సంస్థ నిర్వహణ పట్ల ప్రభుత్వాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, విద్యార్ధుల సమస్యలను పట్టించుకోకపోవడంతో ఈ శిక్షణా సంస్థలో చదివేందుకు ఆసక్తి చూపడంలేదు. భద్రగిరి ఆర్‌ఐటీఐలో ఎలక్ట్రానిక్‌, పిట్టర్‌ , మోటర్‌మెకానిక్‌, వెల్డర్‌, కోపా, డ్రెస్‌ మేకింగ్‌ వంటి విభాగాల్లో విద్యార్ధులు చేరుతుంటారు. కానీ, ఈ శిక్షణా సంస్థలో విద్యార్ధులకు భోజన సౌకర్యం లేక పోవడంతో బయట అద్దెకు రూములు తీసుకొని, విద్యార్ధులే స్వయంగా వంట చేసుకుంటూ, తరగతులకు హజరవుతుంటారు.

మరి కొంతమంది తమ గ్రామాలు నుంచి తరగతులకు వస్తున్నారు. వసతి గృహంలో ప్రస్తుతం ముగ్గురు విద్యార్ధులు మాత్రమే ఉంటున్నారు. విద్యార్ధుల తాగడానికి, స్నానానికి నీటి సౌకర్యం అందుబాటులో లేని పరిస్థితి కూడా ఉంది. శిక్షణా సంస్థలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు పాడయ్యాయి. మరుగుదొడ్లు, రన్నింగ్‌ సౌకర్యం లేకపోవడంతో ఆరు బయటకు వెళ్తున్నారు. ఐటీఐలో సిబ్బంది కొరత కూడా వెంటాడుతోంది. ఇక్కడ 25 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా, ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌, ఇద్దరు ఉపాధ్యాయులు, రికార్డ్‌ అసిస్టెంట్‌, అటెండర్‌లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

వీరి కోసం కేటాయించిన క్వార్టర్స్‌ పూర్తిగా శిథిలం అవ్వ‌డంతో, దూర ప్రాంతాల నుంచి రోజురాకపోకలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, సుమారు రూ. 2.5కోట్లుతో నూతనంగా నిర్మించిన ఆర్‌ఐటీఐ భవనాన్ని నేటికీ ప్రారంభించకపోవడం కూడా విద్యార్ధులు, ప్రజలు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నూతన భవనాన్ని నిర్మించిన గుత్తేదారుకు ప్రభుత్వం నేటి వరకు బిల్లులు చెల్లించకపోవడంతోనే గుత్తేదారు ఈ భవనాన్ని అధికారులకు ఇవ్వలేదని సమాచారం. సాంకేతిక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, విద్యార్ధులు ఉపాధ్యాయుల సమస్యలపై ముందుగా దృష్టిసారించి, సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement