Tuesday, November 26, 2024

ప‌ని చేసినా అంద‌ని కూలీ – వేరే దారి చూసుకుంటున్న లేబ‌ర్

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు పూర్తి స్థాయిలో ఉపాధి ని కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకానికి సంబంధించి రాష్ట్రంలో కూలీల బకాయిలు పేరుకుపోతున్నాయి. గడిచిన నెలరోజులుగా కూలీలకు చెల్లించాల్సిన సొమ్ము అందలేదు. మార్చి చివరి వారం తర్వా త ఇప్పటివరకు ఉపాధిహామీ కూలీలకు చెల్లించి న వారాంతపు సొమ్ములు సకాలంలో అందక పోవడంతో లక్షలాది మంది కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దాదాపు గా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1000 కోట్ల వరకు కూలీలకు దినసరి కూలీల సొమ్ము చెల్లించాల్సి ఉంది. సాధారణంగా వారానికి ఓసారి మస్టర్‌లను చెల్లిస్తుంటారు. అయితే మార్చి చివరి వారం తర్వాత వివిధ కారణాలతో కూలీ సొమ్ములు నిలిచిపోయాయి. దీంతో కొంతమంది ఉపాధి పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మరికొంత మంది ప్రత్యామ్నా య పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి కొంతమంది ఇప్పటికే ఉపాధిహామీ ద్వారా కూలీ గిట్టుబాటు కాకపోవడంతో ఇతర ప్రాంతా లకు వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం పనులకు ఆశించిన స్థాయిలో కూలీలు కూడా అందుబాటులో ఉండడం లేదు.

ఆయా మండలాలకు చెందిన ఉపాధిహామీ అధికారులు పూర్తి స్థాయిలో కూలీలను తీసుకురావడానికి క్షేత్ర స్థాయిలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో వలే ఈ పథకంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతోంది. ఉపాధిహామి నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు పంపుతున్నా వాటిని ఆమోదించి నిధులు కేటాయింపుల్లో కేంద్రంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిధుల కొరతో..లేక సాంకేతిక కారణాలో తెలియదు కాని ఇటీవల కాలంలో ఈ పథకానికి సంబంధించి సకాలంలో కూలీలకు మస్టర్లు అందడం లేదు. కొన్ని సందర్భాల్లో చేసిన పనికి సంబంధించి కూడా కూలీ డబ్బులు తీసుకోవాలంటే ఆధార్‌ లింకు, తదితర ప్రక్రియలో కూడా మరికొంత జాప్యం జరుగుతున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉపాధిహామి పనులకు వచ్చేందుకు కూలీలు ముఖం చాటేస్తున్నారు.

రాష్ట్రంలో రూ.1000 కోట్లకు పైగా బకాయిలు
ఉపాధిహామి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే కూలీలకు ఏరోజుకు ఆరోజు మస్టర్లు వేసి వారానికి ఒకసారి వారికి సొమ్మును చెల్లిస్తుంటారు. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా పెద్దఎత్తున పనులు కూడా చేపడుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రికార్డు స్థాయిలో పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ పథకం ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలందరికీ పనులు కల్పించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో గతంతో కంటే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల పనులు ఉపాధిహామి ద్వారా చేపడుతున్నారు. అయితే మార్చి వరకు కూలీలకు సంబంధించిన బిల్లులు చెల్లించినప్పటికీ, ఏప్రిల్‌ నుంచి మే మొదటి వారం వరకు రావాల్సిన కూలీ సొమ్ము నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1000 కోట్ల వరకు కూలీలకు చెల్లించాల్సి ఉంది. గడిచిన 35 రోజులుగా కూలీ సొమ్ము అందకపోవడంతో నిరుపేదలు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

సరిపోని రోజువారి కూలీ
రాష్ట్రంలో కూలీ ధరలు విపరీతంగా పెరిగాయి. వివిధ నిర్మాణ పనుల్లో పనులకు సంబంధించి కూలీకి వెళ్లితే రోజుకు రూ.650 వరకు ఇస్తున్నారు. అయితే ఉపాధిహామి పథకం ద్వారా చేపట్టే పనులకు మాత్రం రూ.150 నుంచి రూ.170 వరకు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. అది కూడా యూనిట్‌ వారీగా తీసుకుని చెల్లింపులు చేస్తుంటారు. అలాగే చేసిన పనికి సంబంధించి కూడా కూలీ సొమ్ము చెల్లించడంలో మరింత జాప్యం జరుగుతుంది. దీంతో ఉపాధిహామి కూలీ గిట్టుబాటు కాక అత్యధిక మంది గ్రామీణ ప్రాంత కూలీలు పట్టణ ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు.

గ్రామ సర్పంచ్‌ల నిరాసక్త
గతేడాదితో పాటు ప్రస్తుత ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీల పరిధిలో వివిధ నిర్మాణ పనులను చేపట్టారు. అందుకు సంబంధించి కూలీలకు సొమ్ములు చెల్లించడంతో పాటు సర్పంచ్‌లకు బిల్లులు చెల్లింపులోనూ జాప్యం జరుగుతుంది. గ్రామాల్లో ఉపాధి పథకంలో వచ్చిన సాప్ట్‌nవేర్‌ మార్పులు కూడా కూలీలకు కొత్త సమస్యలు తీసుకొచ్చాయి. పనుల్లో జరిగే అక్రమాలు, అవినీతి చెక్‌ పెట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌ఐసీ సాప్ట్‌nవేర్‌ సవాల్‌గా మారింది. ఈ సాప్ట్‌nవేర్‌ వచ్చాక ఉదయం, సాయంత్రం కూలీల హాజరు తీసుకోవాల్సి రావడం, పనులు జరుగుతున్న ప్రదేశాలను ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)లో అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. ఈ కారణం చేత కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement