Friday, November 22, 2024

నకిలీ ధ్రువపత్రాలతో విద్యార్థులకు ప్రవేశం – కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్‌పై సీబీఐ కేసు నమోదు

విశాఖపట్నం: నకిలీ ధ్రువపత్రాలతో విద్యార్థులకు ప్రవేశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా వాల్తేరు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.ఈ మేరకు గురువారం సీబీఐ అధికారులు కేసు వివరాలను వెల్లడించారు. వాల్తేరులోని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఎస్‌ శ్రీనివాస రాజా గత రెండేళ్లలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లంచం తీసుకుని వివిధ కేంద్ర విద్యా సంస్థల పేరుతో ఉన్న నకిలీ ధ్రువపత్రాలతో 193 మంది విద్యార్థులకు పాఠశాలలో అక్రమంగా ప్రవేశం కల్పించినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

2021-22 విద్యా సంవత్సరంలో 124 మంది, 2022-23లో 69 మంది విద్యార్థులకు అక్రమంగా ప్రవేశం కల్పించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే 3, 4 తేదీల్లో సీబీఐ విశాఖపట్నం డివిజన్‌ అధికారులు వాల్తేరులోని కేవీలో ప్రవేశాల వివరాలపై తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ శ్రీనివాస రాజా నకిలీ ధ్రువపత్రాలతో అర్హతలేని విద్యార్థులకు ప్రవేశం కల్పించినట్లు గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి యూపీఐ ద్వారా నగదు బదిలీ జరిగినట్లు విచారణలో తేలింది. దీంతో విచారణ ప్రారంభించిన సీబీఐ, తాజాగా కేసు నమోదు చేసింది. కేంద్రీయ విద్యాలయ కమిషనర్‌ నుంచి అనుమతి పొందిన తర్వాత శ్రీనివాస రాజాపై చర్యలు తీసుకుంటామని సీబీఐ వెల్లడించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement