కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు (45) బుధవారం తెల్లవారుజామున బహిర్బూమికి వెళ్లగా దుండగులు దాడిచేసి హత్యచేశారు.
ఆయన కళ్లలో కారం చల్లి, వేటకొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఇది రాజకీయ హత్యా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రీనివాసులు హత్యతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీనివాసులు హత్యతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.
శ్రీనివాసులు దారుణ హత్య విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఘటన స్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు.
శ్రీనివాసులు హత్య కేసును త్వరగా ఛేదిస్తామని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీం ద్వారా కేసును కొలిక్కి తెస్తామని అన్నారు. తలవెనుక భాగంలో మారణాయుధాలతో బలంగా దాడిచేసి చంపారని డీఎస్పీ వివరించారు. హత్య జరిగిన ప్రదేశానికి కిలో మీటరు దూరంలో బీర్ సీసాలు గుర్తించినట్లు తెలిపారు.
టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్యపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని లోకేశ్ హెచ్చరించారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.