ఆర్యవైశ్యులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని నంద్యాల రోడ్డులో ఉన్న టి.జి లక్ష్మీ వెంకటేష్ వాసవి వైశ్య హాస్టల్ నూతన ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు టి.జి వెంకటేష్ దంపతులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్టల్‌ను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భరత్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులంటే రోశయ్య తర్వాత టి.జి వెంకటేష్ గుర్తొస్తారని చెప్పారు. ఆర్యవైశ్యులకు మంచి చేసేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. విద్యాదానం ఎంతో గొప్పదన్నారు. వైశ్య హాస్టల్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ టి.జి.వి సంస్థల తరుపున దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నట్లు టి.జి భరత్ తెలిపారు.తమ సేవలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయన్నారు.
అనంతరం మాజీ టి.జి వెంకటేష్ మాట్లాడుతూ తాను మొదటి నుండీ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో ఆర్యవైశ్యులను బానిసలుగా చూసేవారన్నారు. దివంగత నాయకుడు రోశయ్యతో కలిసి ఆర్యవైశ్యుల ఎన్నో సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ఆర్యవైశ్యులను బానిసలుగా చూసే నాయకులకు గుణపాఠం చెబుతూ వైశ్యులకు తగిన గౌరవం కల్పించినట్లు గుర్తు చేశారు.
అంతేకాకుండా చదువుకున్న వారికి ఉద్యోగాలు, చదువులేని వారికి ఉపాధి కల్పించి ఆదుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యుల ఆస్తులను పలువురు కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. అలాంటి వారి నుండి ఆస్తులు రక్షించి ఆర్యవైశ్య కమ్యూనిటీ సొంతం చేసేందుకు కృషి చేస్తూనే ఉన్నామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆర్యవైశ్యులందరూ ఒక కుటంబంలా ఉండాలని వెంకటేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, దేవకీ వెంకటేశ్వర్లు, సిద్దా నాగేశ్వరరావు, పెనుగొండ సుబ్బరాయుడు, ఇల్లూరు లక్ష్మయ్య, టి.జి శివరాజు, అమరవాది లక్ష్మీనారాయణ, కోటా సత్యనారాయణ, రజిని, శబరి వరప్రసాద్, రాయపూడి గణేష్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.