Saturday, November 23, 2024

పాలనా వ్యవస్థను స్తంభింపజేస్తాం.. భయపడే ప్రసక్తే లేదు..

కర్నూలు, (ప్రభన్యూస్‌) : ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి భయపడే ప్రసక్తే లేదని సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సచివాలయంతో పాటు మొత్తం వ్యవస్థను స్తంభింప చేయడమే పీఆర్‌సీ సాధన సమితి లక్ష్యమని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ధర్నా చౌక్‌ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఏపీ ఐకాసా జిల్లా అధ్యక్షుడు వెంగళరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని మా సంఘాలలో కూడా ఐక్యత ఏర్పడిందని పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సమ్మెను పకడ్భందిగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఫిబ్రవరి 3న లక్షలాది మందితో ఛలో విజయవాడను విజయవంతం చేస్తామన్నారు. ఏపీ ఐకాసా జిల్లా అధ్యక్షుడు వెంగళరెడ్డి మాట్లాడుతూ 13లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల నమ్మకాన్ని ప్రభుత్వం పొగొట్టుకుందన్నారు.

ప్రభుత్వానికి భారంగా ఉన్న రూ.10వేల కోట్లు తమకు వద్దని పాత జీతాలు ఇవ్వండి చాలు అన్నారు. రూ 1800కోట్లు సప్లిమెంటరీ బిల్లులు, రూ 2100కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాల న్నారు. మా జీతాలలో కోతలు వేసి ప్రభుత్వం ఆ డబ్బులు మిగిల్చి కుంటుందని విమర్శించారు. ఒకటోవ తేదికి పాత జీతాలు వేయకపోతే ఆ తర్వాత పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. పిఆర్‌సి సమస్య పరిష్కారం అయితే ఉద్యోగులలో ఆవేదన, ఆవేశం తగ్గుతుందని ప్రభుత్వంభావిస్తే ఇదంతా భ్రమేనన్నారు. ఈ ఉద్యమం పిఆర్‌సితో పాటు సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొహిబిషన్‌ డిక్లరేషన్‌ వంటి ఇతర అంశాలపై చేస్తున్నామన్నారు. ఏపీ ఐకాసా జిల్లా కార్యదర్శి జవహార్‌లాల్‌, ఏపీజిఈఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రఘుబాబు, ఏపీజిఈఎ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, ఏపీ ఐకాసా అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి, ఏపీ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడు కాశన్న, నగర కార్యదర్శి పాండురంగారెడ్డి, ఆర్‌ అండ్‌బీ ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌వీ రమణ, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఎన్‌జీఓ అసోసియేషన్‌ కర్నూలు డివిజన్‌ అధ్యక్షుడు నాగరాజు, ఏపీ టైపిస్టు స్టెనో గ్రాఫర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, ఏపీ ఎన్‌జిఓ స్టేట్‌ ప్రసిడెంట్‌ దస్తగిరిరెడ్డి, ఆ సంఘం జిల్లా జాయింట్‌ సెక్రటరీ బలరామురెడ్డి, పిఆర్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణానిధిమూర్తిలు మాట్లాడుతూ చీకటి జిఓలు రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం నిత్యం తమ పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ముందు ముందు ఉద్యోగులు సత్తా ఏమిటో తెలుస్తుందని ప్రభుత్వమే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. జిల్లా నలుమూల నుంచి వేలాది మంది ఉద్యోగులు పెద్ద ఎత్తున రిలే దీక్షలలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement