కర్నూలు, (ప్రభ న్యూస్) : ధాన్యం రైతులకు భయం లేదు.. ప్రభుత్వం అండగా ఉంటుంది.. ధైర్యంగా ఉండడి.. జిల్లాలో ఖరీఫ్‌లో సాగుచేసిన వరి పంట చాల వరకు దెబ్బతింది. తుఫాన్‌లు, అకాల వర్షాలు ఇతరత్ర కారణాల వల్ల పంటలు దెబ్బతిన్న సందర్బంలో జిల్లాలో పర్యటించిన మంత్రులు వర్షంలో దెబ్బతిన్న ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ధైర్యం ఇచ్చారు. ప్రభుత్వం స్వయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యంను కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. అంతేకాదు ధాన్యం విక్రయించిన రైతులకు 21 రోజుల్లోనే నగదు చెల్లింపులు చేస్తామని గొప్పగా చెప్పారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీంతో జిల్లాలో ధాన్యం విక్రయ రైతులకు తిరిగి అవే కష్టాలు మొదలయ్యాయి. ప్రతి ఏటా ఖరీఫ్‌లో అన్న దాతలు ధాన్యం బకాయిల కోసం తమ కళ్లకు కాయలు కాచేలా ఎదురుచూడ్డం తప్పనిసరిగా మారింది. ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం తర్వాత సకాలంలో డబ్బులు చెల్లించడంలో ప్రతి సీజన్‌లో విఫలం అవుతుంది. బకాయిల కోసం గతేడాది రబీలో ఏకంగా రైతులు ఆందోళనలతో రోడెక్కిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్‌లో అటువంటి సమస్యలు లేకుండా చేస్తామని జిల్లా మంత్రులు హామి ఇచ్చారు. ప్రస్తుత పరిస్ధితి చూస్తే వారి మాటలు ఎందుకు కొరగాకుండా పోయాయి. 21 రోజుల్లోనే కాదు కదా.. నెలలు దాటినా చెల్లింపుల ఊసేలేదు. అందుకు నిదర్శనమే జిల్లాలో రూ.7.05 కోట్ల ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటి వరకు కేవలం రూ. 2.42 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారంటే పరిస్ధితిని గ్రహించవచ్చు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం రైతులకు ధాన్యం బిల్లుల బకాయిలు తలనొప్పిగా మారాయి.
ఖరీఫ్, రబీ సీజన్లలో కొనుగోలు చేసి ధాన్యంకు నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సరం చేయడం పరిపాటిగా మారింది. దీంతో అప్పులు చేసి పంటలను సాగు చేస్తున్న రైతులకు సకాలంలో డబ్బు అందకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. గత రబీ సీజన్‌లో ఇదే నెలకొంది. నెలల తరబడి బకాయిలు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా అప్పుల్లో కూరకపోవడంతో బాకీలు చెల్లించడం సాధ్యం కాలేదు. దీంతో రైతులు చేసేది లేక ఆందోళన బాట పట్టారు. నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఖరీఫ్ ఆఖర్లో ధాన్యం కోనుగోలు సీజన్ మొదలైంది. అయితే గతేడాది ఆందోళన నేపథ్యంలో ఈ సారి ధాన్యం డబ్బుల చెల్లింపులు ఆలస్యం చేయకూడదని ముఖ్యమంత్రి జగన్‌మోహాన్ రెడ్డి స్వయంగా అధికారులను ఆదేశించారు. ఆర్‌బికేలకు ధాన్యం ఇచ్చిన 21 రోజుల్లో డబ్బులు అన్నదాతల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడంతో అంతా నిజమేనని రైతులు సంభరపడ్డారు. తీరా ఆచరణలోకి వచ్చే సరికి ఇది అమలుకాకపోవడంతో రైతులకు నిరాశ తప్పలేదు. మళ్లి గతంలో మాదిరే జిల్లాలో ధాన్యం బకాయిలు పేరుకపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..