Tuesday, November 26, 2024

వీడిన జంట హత్యల కేసు మిస్టరీ… భార్యలను హతమార్చిన భర్తలు..

కర్నూలు : ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామ పరిధిలో జరిగిన మహిళల జంట హత్య కేసు వీడింది. ఈ కేసులో హత్యకు గురైన మహిళల భర్తలతో పాటు, మామను అరెస్టు చేశారు. కర్నూలు అడిషనల్ ఎస్పీతో పాటు కేసు విచారించిన దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వెల్లడించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన కురువ తాండ్రపాడు పెద్ద గోవర్ధనకు ఇద్దరు కుమారులు. ఊరిలో పెద్ద కుమారుడు రామ గోవిందు ఇతనికి గూడూరు మండలం, గుడిపాడు గ్రామస్థురాలు రామేశ్వరితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే నేటి వరకు వీళ్లకు పిల్లలు పుట్టలేదు. ఇక రెండో కుమారుడైన చిన్న రామ గోవిందుకు కల్లూరు మండలం పెద్ద సుంకన్న కుమార్తె రేణుకతో 2020లో వివాహం జరిగింది. ఆమెకు కూడా నేటి వరకు పిల్లలు పుట్టలేదు. తమకు సంతానం కలగకపోవడంతో తరచూ భర్తలతో గోవిందమ్మ, రేణుకలకు స్వల్ప కలతలు రేగాయి. ఇదే సమయంలో రేణుక తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కిటికీ నుంచి తొంగిచూశారని ఆ వ్యక్తి రేణుక కోసమే వచ్చాడని భర్త చిన్న గోవిందు అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయం తండ్రితో కొడుకులు చర్చించగా, కొడుకులు ఇద్దరికీ మందు పెట్టారని భావించారు. అనంతరం ఈ విషయంను నివృత్తి చేసుకునేందుకు కర్నూల్ పరిధిలోని జోరాపురంకు చెందిన పార్వతమ్మ అనే నాటు వైద్యారాలును కలిశారు. ఆమె మీ ఇంట్లో ఎవరో మీకు మందు పెట్టారని నమ్మ బలికింది. ఈ మందుకు విరుగుడు మందు తీసుకోకపోతే మీ ఆరోగ్యం చెడిపోయేదని వారితో వివరించింది. దీంతో పెద్ద గోవిందు, చిన్న గోవిందు, వారి తండ్రి పెద్ద గోవర్ధన కోడళ్ల‌ పై మరింత అనుమానం పెంచుకున్నారు. తమ ముగ్గురిని హతమార్చి కోడలు ఆస్తి కొట్టేయాలని మన్నాగం పన్నినట్లు భావించారు. ఈ అనుమానాలతో తండ్రితో కలిసి తమ భార్యలను నన్నూరు పరిధిలోని మంగలి లక్ష్మన్న అనే వ్యక్తికి చెందిన పొలం వద్దకు తీసుకువచ్చి రేణుక, రాములమ్మను దారుణంగా హతమార్చారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దిశా పోలీస్ స్టేషన్ డీఎస్పి వెంకటరామయ్య నేతృత్వంలో విచారణ నిర్వహించారు. వీరి విచారణ మేరకు హత్య స్థలంలో లభించిన ఓ చెప్పు, నిందితుల ఇంటి వద్ద లభించిన మరో చెప్పు ఒకటే కావడంతో.. తండ్రి కొడుకులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తమదైన స్టైల్ లో విచారించగా, తండ్రి, కొడుకులే హత్యలు చేసినట్లుగా ఒప్పుకున్నారు. తమ భార్యలు పసురు పెట్టి తమను హతమార్చేందుకు కుట్ర పన్నారా అనే ఉద్దేశంతోనే వారిని హతమార్చినట్లు పోలీసు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. ఈ హత్యలకు పరోక్ష కారణమైన నాటు వైద్యాలు పార్వతమ్మను కూడా పోలీసులు అరెస్టు చేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement