కర్నూలు : రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా మరో సీనియర్ రంగస్థల కళాకారుడిని కోల్పోయింది. దాదాపు 40 ఏళ్లకు పైబడి నాటకరంగానికి విశేష సేవలు అందించిన కొండ రామకృష్ణారెడ్డి కర్నూలు నగరంలోని మద్దూర్ నగర్ లో ఉన్న తన నివాసంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణవార్త గురించి తెలిసిన వెంటనే హనుమాన్ కళా సమితి వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ.. రేనాటి గడ్డ ముద్దుబిడ్డగా.. కర్నూలు విశ్వామిత్రుడుగా.. మాటల గారడీతో.. కర్నూలు మాయల ఫకీరుగా.. దుర్యోధనుడిగా.. నాటక రంగంలో విశిష్ట గుర్తింపు పొందిన ఆయన అనారోగ్యంతో చనిపోవడం నమ్మశక్యంగా లేదన్నారు. రాయలసీమ ముఖద్వారంలో కళారంగానికి రామకృష్ణారెడ్డి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని హనుమంతరావు చౌదరి పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగస్థల సీనియర్ కళాకారులు లక్ష్మణ రాజు, హనుమంతు నాయుడు, హార్మోనిస్టు వెంకటేశ్వర్లు, భాస్కర్ యాదవ్, నాగరాజు, కేశన్న, లక్ష్మన్న, మంజులా రామకృష్ణ తదితరులు పాల్గొని రామకృష్ణారెడ్డి మృతికి సంతాపం తెలియజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement