1.24 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కృష్ణా ప్రాజెక్టులపై 1,033 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పాదన
నంద్యాల బ్యూరో, ఆగస్టు 22 (ప్రభ న్యూస్) : కృష్ణా బేసిన్ ఎగువ పరీవాహకంలో వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 31వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డు కాగా… గురువారంకు 1,24,112 క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి 1,03,950 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతేస్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జలవిద్యుత్తు ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 71,910 క్యూసెక్కులను సాగర్‌కు వదిలేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఘాట్‌రోడ్డులో ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి.
దీంతో తెలంగాణ నుంచి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 47వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. జలవిద్యుత్తు ఉత్పాదనతో 47 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 19వేల ఇన్‌ఫ్లో ఉండగా… 33 వేల ఔట్ ఫ్లో ఉంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో జలవిద్యుత్తు ఉత్పాదన జోరందుకుంది. రోజుకు గరిష్ఠంగా 46మిలియన్ యూనిట్ల దాకా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి దాకా 1033.92 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్తు ఉత్పాదన జరిగిందని అధికారులు తెలుపుతున్నారు.
ఇందులో శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో 488.88 మిలియన్ యూనిట్లు కాగా, నాగార్జునసాగర్‌లో 342.38 మిలియన్ యూనిట్లు, జూరాలలో 90.16 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఇక తుంగభద్ర ప్రాజెక్టుకు 30వేల ఇన్‌ఫ్లో ఉండగా… 9,010 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. గోదావరి బేసిన్‌లోని ఎల్లంపల్లికి 12 వేలు, ఎస్సారెస్పీకి 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయ్యింది. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతోంది.