Friday, November 22, 2024

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : క‌లెక్ట‌ర్ కోటేశ్వ‌ర‌రావు

ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో వచ్చే ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పక్కాగా ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా క్యాంపు కార్యాలయం నుండి కర్నూలు, ప్రకాశం జిల్లా అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్రం అచ్చంపేట, అమ్రాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల అధికారులతో ఏర్పాట్లపై సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈసంద‌ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కానీయకుండా ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని, అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే తెలంగాణ జిల్లాలు, ప్రకాశం జిల్లా అధికారులు, దేవస్థానం అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఇతర అధికారులు సమన్వయంతో పనించేయాలన్నారు. పాగాలంకరణ, శివరాత్రి పండుగ, రథోత్సవం మన రాష్ట్రంతో పాటుకర్ణాటక, మహారాష్ట్ర నుండి లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అలాగే అన్న ప్రసాదం, త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసు భద్రత, గజ ఈతగాళ్ల ఏర్పాటు, వసతి కల్పన, మెడికల్ క్యాంపులు, తగినన్ని ఆర్టీసీ బస్సుల ఏర్పాటు లాంటి అన్ని అంశాల్లో కూడా అధికారులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనల కు సంబంధించి దేవాదాయ శాఖ నుంచి స్పష్టమైన సూచనలు తీసుకోవాలని కలెక్టర్ ఈఓ ను ఆదేశించారు. ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు రామ సుందర్ రెడ్డి, నారపురెడ్డి మౌర్య, శ్రీనివాసులు, శ్రీశైలం ఈఓ లవన్న, డిఆర్ఓ పుల్లయ్య, కర్నూలు, ప్రకాశం జిల్లా అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement