Wednesday, September 18, 2024

KNL: గాజులదిన్నె ప్రాజెక్ట్ గేట్లను పరిశీలించిన ఎస్ఈ..

గోనెగండ్ల, ఆగస్టు 21 (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లను బుధవారం ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి పరిశీలించారు. సోమవారం ఆస్పరి, దేవనకొండ మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టుకు ఇటీవల అమర్చిన కొత్త గేట్ల పనితీరును పరిశీలించడానికి ఆయన ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు 5, 6 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి గేట్ల పనితీరును పరిశీలించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఎగువన కురిసిన వరదల వల్ల గాజులదిన్నె ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం రెండు టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉందన్నారు. ప్రాజెక్టుకు ఇటీవల ఐదు కొత్త గేట్లను అమర్చడం జరిగిందన్నారు. ప్రస్తుతం అమర్చిన కొత్త గేట్లు ఒక లక్ష క్యూసెక్కుల‌ నీటిని తట్టుకునే సామర్థ్యం ఉందన్నారు. కాబట్టి ప్రాజెక్టు భద్రతకు ఎటువంటి ముప్పు లేదన్నారు. అలాగే గాజులదిన్నె ప్రాజెక్ట్ ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే పొలాల రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారికి పూర్తిస్థాయి పరిహారం అందించిన తర్వాతనే ప్రాజెక్టుల్లో 5.5 టీఎంసీ నీటిని నిల్వ ఉంచుతామన్నారు.

అంతవరకు గతంలో మాదిరిగానే 4.5 టిఎంసిలు మాత్రమే నీరు నిల్వ ఉంచుతామని అందువల్ల ముంపునకు గురయ్యే పొలాల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రాజెక్టు ఒక మీటర్ ఎత్తు పెంచడం వల్ల 440 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అందులో 330 ఎకరాలు ముంపునకు గుర‌య్యే భూముల వివరాలను గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన 100 ఎకరాల భూమి వివరాలు గుర్తించవలసి ఉందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు 90శాతం పూర్తయ్యాయని, చేసిన పనులకు గాను 30 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించిన వెంటనే మిగిలిన పనులు మూడు నెలల్లోపు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ శైలేశ్వర్ రెడ్డి, డీఈ విజయ్ కుమార్, ఏఈ మహమ్మద్ అలీ, ఉగ్ర నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement