Tuesday, November 26, 2024

పోటెత్తిన వరద.. కృష్ణమ్మ పరవళ్లు.. తుంగభద్ర తుళ్లింత..

  • శ్రీశైల జలాశయానికి భారీగా వరద..
  • జలాశయంకు ఇన్ ఫ్లో 3.03 లక్షలు.. అవుట్ ఫ్లో 31.784 క్యూసెక్కులు

కర్నూలు బ్యూరో : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఇక తుంగభద్ర నీటి పరవల్లతో పరవశిస్తుంది. దీంతో కర్ణాటక, తెలంగాణతో పాటు కర్నూలు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం మొత్తం శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు అందిన సమాచారం మేరకు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను, వరద ప్రవాహం తో 859.60 అడుగులకు చేరుకుంది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీల‌కు గాను ప్రస్తుతం 104.6466 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఇక ప్రాజెక్టుకు 3,03,779 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇందులో జూరాల నుంచి లక్ష 50 వేల 783 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, ఇక సుంకేసుల బ్యారేజీ నుంచి లక్ష 52 వేల 585 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్న తెలంగాణ…
శ్రీశైలం జలాశయం 859.60 అడుగులకు చేరగా తెలంగాణ ఎడమ గట్టులో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. ఆదివారం కూడా విద్యుత్ ఉత్పాదన 31, 784 క్యూసెక్కులు వినియోగించడం గమనార్హం.

తుంగ‌భద్ర..
కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల మూలంగా తుంగభద్రకు జలకళ ఉట్టిపడుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులకు గాను, ప్రస్తుతం 1630.56 అడుగులుగా ఉంది. 105 టీఎంసీలకు గాను, 96.191 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో లక్ష 48,420 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇక జలాశయంకు చెందిన 31 గేట్ల ద్వారా 1,49,881 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదలవుతుంది. ఇందులో హెచ్ ఎల్ సి కి 722 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ కర్ణాటక బార్డర్ కు 700 క్యూసెక్కులు , ఎల్ ఎల్ సికి ఆంధ్ర బోర్డర్ కు 580 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సుంకేసులకు వరద పోటు
తుంగభద్ర పొంగి ప్రవహిస్తుండడంతో జలాశయం నుంచి 30 గేట్ల దిగువకు నీటి విడుదల నీరు అవుతుంది. విడుదలైన నీరు నేరుగా సుంకేసుల చేరుకుంటుంది. అయితే తుంగభద్ర నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో ఇప్పటికే నది కింద ఉన్న పంట పొలాలు నీట మునిగాయి, ఖరీఫ్ ను దృష్టిలో పెట్టుకొని చాలామంది రైతులు వంటలు సాగు చేశారు. చాలా చోట్ల మొలక దశలో ఉన్న పంటలు తుంగభద్ర నదికి నీటి రాకతో నీట మునిగాయి. వీటి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మరోవైపు పంపుసెట్లు మునిగిపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement