నంద్యాల : శ్రీశైలం (మం) సున్నిపెంటలో శనివారం ఉధృత వాతావరణం నెలకొంది. శ్రీశైలంలో సంతోష్ నాయక్ అనే వ్యక్తిని కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నా కొడుకును చంపిన వారిని వెంటనే అరెస్టు చేయాలని తల్లిదండ్రులు పోలీసుల ఎదుట డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మృతుడి బంధువులు బైఠాయించి ఆందోళన చేశారు. సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలల్లో ఉన్న సంతోష్ నాయక్ మృతదేహాన్ని ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ సందర్శించారు. సంతోష్ నిన్న శ్రీశైలంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన అడవిలో చెట్టుకు ఊరి వేసుకుని చనిపోయాడు. దీంతో తమ కుమారుడిని కొట్టి చంపి చెట్టుకు ఉరి వేశారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయలని ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. సంతోష్ ను కొట్టి చంపారు అనడానికి అతని ఒంటిపై గాయాలు ఉన్నాయని, నిందితులు ఎంతటివారైనా శిక్షించాలన్నారు. బాధితుల కుటుంబానికి ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందన్నారు. ఈ విషయంపై ఎస్పీ, డీఎస్పీతో మాట్లాడాతానన్నారు. అనంతరం శ్రీశైలం సీఐ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అందరూ ఇచ్చిన స్టేట్ మెంట్ రికార్డ్ చేశామని, ఇంకా ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకి తెలియజేయాలన్నారు. సంతోష్ నాయక్ ను ఎవరైనా కొట్టేటప్పుడు, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్టు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే ప్రేమ వ్యవహారమే కారణమని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement