మదర్ థెరిసా సేవలు ఆదర్శనీయమని.. ప్రతి ఒక్కరూ అనుసరించదగ్గవని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. శుక్రవారం మదర్ థెరిసా 113వ జయంతిని పురస్కరించుకొని ఆయన నగరంలోని మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎక్కడో విదేశాల్లో పుట్టిన మదర్ థెరిసా భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది రోగులకు వైద్య సేవలందించారన్నారు.
అలాగే ఎటువంటి సౌకర్యం లేని కాలంలో ప్రతి ఒక్కరికీ విద్యను అందించాలన్న ఉద్దేశంతో తమ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ద్వారా ఎన్నో విద్యాలయాల నెలకొల్పి లక్షలాది మంది విద్యను అభ్యసించేలా చేసిన ఘనత ఒక మదర్ థెరిసాకే దక్కుతుందన్నారు. మదర్ థెరిసా భౌతికంగా మన మధ్యన లేకపోయినప్పటికీ ఆమె చూపించిన మార్గాలు నేటికీ కొనసాగుతూ ఎంతోమందికి మార్గదర్శనం చేస్తున్నాయని ఆయన కొనియాడారు. సేవే పరమావధిగా తన జీవితాన్ని పేదలకు సేవ చేయడానికి అంకితం ఇచ్చిన మదర్ థెరిసాను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీజీ వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.