కర్నూల్ : కర్నూలు జిల్లాకి అన్యాయం చేసిన ఘనత తెదేపాది అని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. తనపై లోకేష్ చేసిన ఆరోపణలను నిరూపించాలని.. కావాలంటే తాను పాదయాత్రలో తనతో కలిసి నడుస్తానని సవాల్ చేశారు. ఈ మేరకు సోమవారం కర్నూలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి యువనేత నారా లోకేష్ తనపైన చేసిన ఆరోపణల పై హఫీజ్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేసేందుకు, ప్రజలకు అందుబాటులో పనిచేసెందుకు అమెరికాలోని లగ్జరీ లైఫ్ వదులుకొని వచ్చిన వ్యక్తి తానని చెప్పారు. తాను స్థలాలు కబ్జా చేశానని ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా అని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివరాలు కర్నూల్ పరిధిలో వెలికి తీసి కాపాడే ప్రయత్నం చేసింది తానని తెలిపారు.
వక్ఫ్ సీఈఓను రెండు సార్లు కర్నూల్ కు తీసుకువచ్చి వక్ఫ్ బోర్డు ఆస్తులపై సమీక్షలు నిర్వహించింది మా ప్రభుత్వ హయాంలోనే అని స్పష్టం చేశారు. కర్నూల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్రలో కలిసి నడవడానికి సిద్దమని తెలిపారు. తన పై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించాలని సూచించారు. పాదయాత్రలో ఎక్కడ కలవాలో చెప్పి లోకేష్ మర్యాద కాపాడుకోవాలి, అలా కాకపోతే ఈ రోజు సాయంత్రం లోపల ఎక్కడో ఒక చోట తాను పాదయాత్ర లోకి వస్తాను అని తెలిపారు. తన అనుచర గణం కానీ,పార్టీ కార్యకర్తలు గానీ ఎవరు రారు.. కేవలం తాను ఒక్కడినే వస్తాను అని హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. కర్నూల్ కి అన్యాయం చేసిన ఘనత మీ పార్టీ దీ, ఇంత వరకు రాజధానిని గానీ హైకోర్టు ను గానీ మాకు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు.