కర్నూలు బ్యూరో, ఆగస్టు 21 (ప్రభ న్యూస్) : గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గంజాయి, మత్తుపదార్థాలను వినియోగించకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో పర్యవేక్షణ, తనిఖీలను పెంచాలన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాలన్నారు. అంతర పంటగా గంజాయి సాగుచేసే అవకాశం ఉందని, అటవీ, వ్యవసాయ శాఖ అధికారులు గమనిస్తూ ఉండాలన్నారు. తెలిస్తే సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.
అదేవిధంగా జిల్లా సరిహద్దుల్లో తిరిగే బస్సులు, బస్టాండ్స్ పై కూడా నిఘా ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కళాశాలలు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ సమావేశాల్లో మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ఒక ప్రతిజ్ఞ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డిఅడ్డిక్షన్ సెంటరుకు ఎంత మంది వచ్చి చికిత్స తీసుకుంటున్నారనే వివరాలను కలెక్టర్ డిఎంహెచ్ఓను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై యువతలో అవగాహన కల్పించేందుకు హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో పాటు 30ప్రభుత్వ కళాశాలలు, 44 ప్రైవేటు కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా జూనియర్, సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్డిపిఎస్ యాక్ట్ (యన్ డిపిఎస్ ఆక్ట్) గురించి విద్యార్థులకు పూర్తిగా అవగాహన కల్పించడం జరిగిందని ఎస్పీ వివరించారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, సెబ్ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్, అటవీ శాఖ అధికారిణి శ్యామల, ఇంఛార్జి మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్, డీటీసీ శ్రీధర్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఔషద నియంత్రణ ఏడీ రమాదేవి, ఇంఛార్జి డీఎంహెచ్ఓ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.