Friday, November 22, 2024

KNL: రాయలసీమ నిజదర్శన దీక్షను విజయవంతం చేయండి..

ఈనెల 27న నంద్యాలలో రాయలసీమ సమస్యలపై నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన రాయ‌ల‌సీమ నిజ‌ద‌ర్శ‌న‌ దీక్షను విజ‌య‌వంతం చేయాల‌ని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాద్యక్షులు వై.యన్.రెడ్డి, ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి అన్నారు. శనివారం నంద్యాల సమితి కార్యాలయంలో “రాయలసీమ నిజదర్శన దీక్షకు ” సంబంధించి కరపత్రాలను సమితి నాయకులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా వై.యన్.రెడ్డి మాట్లాడుతూ… తుంగభద్ర, కృష్ణా నదుల్లో నీరు ప్రవహిస్తున్నా, రాయలసీమకు చట్టబద్ధమైన నీటి హక్కులున్నా ప్రాజెక్టులు నీరు పొందలేకపోవడానికి గల కారణాలను విశ్లేషించి, తగిన కార్యాచరణ చేపట్టడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.‌ అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాల్సిన ఈ కార్యక్రమాలను విస్మరించి, రాయలసీమ ఎత్తిపోతల పూర్తి అయ్యేవరకు, గోదావరి జలాలు మళ్ళించేంత వరకు ఆగండని మభ్యపరిచే కార్యక్రమాలు పాలక, ప్రతిపక్ష పార్టీలు చేపట్టాయని ఆరోపించారు.

రాజ్యాంగం, బచావత్ ట్రిబ్యునల్, రాష్ట్ర విభజన చట్టం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కల్పించిన నీటి హక్కులకు తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 6న తీసుకొని వచ్చిన చీకటి చట్టం రద్దుకై పోరాడాలని పాలకులు, రాజకీయ పార్టీలను కోరుతున్నామన్నారు.రాయలసీమ అభివృద్ధికి చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, పెన్నా నది పునరుజ్జీవనకు ప్రత్యేక సాగునీటి కమీషన్ ఏర్పాటుకు కృషి చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు ఆంధ్రాబ్యాంక్ విశ్రాంత ఏజీఎం శివనాగిరెడ్డి, మహమ్మద్ పర్వేజ్, భాస్కర్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, శివరామిరెడ్డి, పట్నం రాముడు, క్రిష్ణమోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ జూపల్లె గోపాల్ రెడ్డి, రాఘవేంద్రగౌడ్, షణ్ముఖరావు, సుదర్శన్, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement