Tuesday, November 19, 2024

అతడో బాణం – ధనుర్విద్యలో దిట్టగా కడప కుర్రాడు.. ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం..

కడప, ప్రభన్యూస్‌ : కడప కుర్రాడు ఉదయ్‌కుమార్‌కు చిన్నప్పటి నుంచే విలువవిద్యపై ఎందుకో తెలియని మోజు. బాణం సందించడంపైనే నిరంతరం ధ్యాస. గురువుకోసం అంతర్జాలంలో శోధించి… చివరకు చెన్నైలో వాసు గురువును ఆశ్రయించాడు. నిరంతరం సాధన చేశారు. ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు మూడు బాణాలను గురితప్పకుండా సంధించి సోని టి.వి నిర్వహించిన ఇండియా ఘాట్‌ టాలెంట్‌ పోటీల్లో న్యాయనిర్ణేతలను మెప్పించాడు. వర్ధి ఉదయ్‌ కుమార్‌ ప్రతిభ చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఆర్చరీ విద్యలో అరుదైన గుర్తింపును తెచ్చుకున్న కడపకు చెందిన వర్ధి ఉదయ్‌ కుమార్‌ చిన్న‌ప్పటి నుంచి సినిమాలు, టీవీల్లో ప్రసారమయ్యే రామాయణ మహాభారతాల యుద్ధ ఘట్టాలే ప్రేరణగా ధనుర్విద్య కళను నేర్చుకోవాలనుకున్నాడు. ఆధునిక ధనస్సులు, బాణాలు లాంటివి కొనుగోలు చేయడం బాగా ఖర్చుతో కూడుకున్నదే. పేదరికాన్ని జయించి బాణాల్ని సంధించాలనుకున్నాడు. ఇలాంటి విద్యలు కూడు పెడతాయా అని అమ్మ అన్నా వెనుకడుగువేయలేదు. ఆర్చరీలో ఆరి తేరుతూ వచ్చాడు. 2021లో సోని టి.వి నిర్వహించిన ఇండియా ఘాట్‌ టాలెంట్‌ పోటీల్లో ఔరా అన్పించాడు. మొదట కరాటే నేర్చుకున్నాడు. కుంగ్‌ఫూ, మార్సల్‌ ఆర్ట్స్‌లో సెకండ్‌ డిగ్రీ బ్లాక్‌ బెల్ట్‌సాధించాడు. 2010 నుండి ధనుర్విద్యను నేర్చుకున్న ఉదయ్‌ ఆర్థిక పరిస్థితుల కారణంగా వారంలో ఒకరోజు చెన్నైకు వెళ్ళి శిక్షణ పొందేవాడు. ఆ తర్వాత ముంబైలో ఆర్చరీ క్యాంప్‌లు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూడా నేర్చుకోవడం జరిగింది.

ఇంటర్నేషనల్‌ కోచ్‌గా…

ధనుర్విద్యలో ప్రావీణ్యం సాధించిన ఉదయ్‌ కుమార్‌ ప్రస్తుతం లెవెల్‌ 2 ఇంటర్నెషనల్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 2013లో కడపనగరంలో విజయాస్‌ ఆర్చరీ అకాడమి ఏర్పాటు చేశారు. లెవెల్‌ 1, లెవెన్‌ 2లో అడ్వాన్స్‌ లెవెల్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ అకాడమీలో ప్రస్తుతం 45 మంది శిక్షణ పొందుతున్నారు. అంతేకాదు కడప, ఖాజీపేట, ప్రొద్దుటూరులోని పలు స్కూళ్లలో కూడా శిక్షణ ఇస్తున్నారు. వీకెండ్‌లో బెంగుళూరుకు వెళ్లి అక్కడ కూడా శిక్షణ ఇస్తున్నారు. గత 8 ఏళ్ళలో ఆయన 1000 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. ఈయన వద్ద శిక్షణ పొందిన 300 మంది విద్యార్థులు అనేక పతకాలు సాధించారు. వర్ధి ఉదయ్‌ కుమార్‌ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో పంజాబ్‌, తమిళనాడు, పాండిచ్చేరి, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో నిర్వహించిన ఆర్చరీ పోటీల్లో 150 మంది పాల్గొని పతకాలు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో 2019 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ దేశంలో వెల్లింగ్టన్‌లో నిర్వహించి వరల్డ్‌ ఇండోర్‌ ఆర్చరీ చాంఫియన్‌ షిప్‌లో పాల్గొని ఉదయ్‌ వద్ద శిక్షణ పొందిన కడప, బెంగళూరుకు చెందిన ముగ్గురు బంగారు పతకాలు సాధించారు.

ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు..

2018లో చెన్నైలో పతాం జలి యోగా రీసెర్చ్‌ సెంటర్‌ వారు నిర్వహించిన ఆర్చరీ పోటీల్లో ఉదయ్‌తో పాటు మరో ఇద్దరు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఉదయ్‌ 15 నిమిషాల 15 సెకన్లలో 200 యారోస్‌ షూట్‌ చేసి ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో చోటు సాధించారు. 2015 లో ముంబయిలో జరిగిన జాతీయ ఆర్చరీ పోటీల్లో కాంస్యం పతకం సాధించారు. 2021 లో ట్రెడిషన్‌ ఆర్చరీ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్‌లైన్‌ ఆర్చరీ పోటీల్లో 2వ స్థాన సాధించారు. ఆర్చరీ విద్యలో వుండే లెవెల్‌ 1, లెవెన్‌ 2 స్థాయిలో లెవెన్‌ 2 కోచ్‌ లో భారతదేశంలో నలుగురు వుంటే అందులో ఉదయ్‌ కుమార్‌ ఒకరు. ఉదయ్‌ కుమార్‌ ఫీల్డ్‌ ఆర్చరీ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్‌ పీల్డ్‌ ఆర్చరీ జనరల్‌ సెక్రటరీ, విజయ ఆర్చరీ ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ధనుర్విద్యలో శిక్షణ ఇచ్చేందుకు యుఎస్‌ఏ వెళ్ళనున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement