Sunday, November 10, 2024

KNL | డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు… ఎస్పీ బిందు మాధవ్

డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావని, పోటీ పరీక్షలు, ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగాలు వస్తాయని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్నారని పలువురు బాధితులు కర్నూల్ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ దృష్టికి వచ్చారు. నిందితులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా ప్రజలు, నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జరిగే మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ మంగళవారం విజ్ఞప్తి చేశారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగాలు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తాయన్నారు. సాఫ్ట్ వేర్ జాబ్స్, బ్యాంకుల్లో ఉద్యోగాలు, సచివాలయాల్లో ఉద్యోగాలు, హోంగార్డ్సు ఉద్యోగాలు, పుడ్ కార్పోరేషన్ లో ఉద్యోగాలంటూ పలురకాల ఉద్యోగాల పేరుతో వివిధ రకాలుగా దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోతూనే ఉన్నారన్నారు. ఏ ఉద్యోగం అయినా మధ్యవర్తుల ద్వారా రాదన్నారు.

- Advertisement -

ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అలాంటివి నమ్మి మోసపోవద్దన్నారు. అమాయకులనే లక్ష్యంగా ఎంచుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దళారులు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, డబ్బులు వసూలు చేసే వారి గురించిన సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషన్ లో ముందుస్తుగా ఫిర్యాదు చేసి తెలియజేయాలన్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాల పేరుతో మోసపోతున్న ఫిర్యాదులు ఎక్కువగా అవుతున్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా యువతకు, విద్యార్ధులకు, జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement