కర్నూలు బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మందు బాబులకు మింగుడుపడని అంశం మద్యం దుకాణాల మూసివేత. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం నుంచి బుధవారం వరకు మద్యం షాపులను మూసివేసేలా ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో వరుసగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయని తెలియడంతో మందుబాబులు ఆదివారం అర్థరాత్రి వరకు మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. మూడు రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేసి భద్రపరచుకోవడంలో నిమగ్నమయ్యారు. దీంతో ఆదివారం ఒక్కరోజే రూ.5కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ప్రొవిజిన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియజేశారు.
ముఖ్యంగా బార్లు, దుకాణాలు మూతపడనుoడడంతో ఆదివారం మద్యం అమ్మకాలతో కిటకిటలాడాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో 175 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 49 బార్లు ఉన్నాయి. ఈనెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 3, 4వ తేదీల్లో విక్రయాలు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆదివారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో రూ.5కోట్లకు పైగా అమ్మకాలు జరిగి ఉంటాయని అంచనా. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి మద్యం దుకాణాలు బంద్ చేశారు. జూన్ 6న ఉదయం తిరిగి వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.