Friday, November 22, 2024

రాష్ట్రానికి నందికొట్కూరు లేకుంటే తాగునీరు లేదు : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

నందికొట్కూరు : నంద్యాల వద్దు కర్నూలు ముద్దు అంటూ, రాష్ట్రంలో అనాలోచిత నిర్ణయాలతో జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలోని అల్లూరు రోడ్డులో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట నంద్యాల వద్దు కర్నూలు ముద్దు అంటూ ఒక్క రోజు నిరాహారదీక్ష బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా మిడుతూరు రోడ్డులో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… కర్నూలు జిల్లా నుండి నందికొట్కూరు నియోజకవర్గాన్నివేరు చేసి నంద్యాలకు కలుపుతున్నారని అదే జరిగితే ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. నందికొట్కూరు ప్రాంత ప్రజలందరూ కర్నూలుకి సమీపంలో ఉండటంతో సంబంధాలు పెరిగాయని, ప్రతి చిన్న పనికి కర్నూలుకు వెళ్తారన్నారు.

ప్రజలు అనారోగ్యంతో అత్యంత పరిస్థితులు వున్నప్పుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరలో ఉన్నందున కేవలం అరగంటలో చేరుకుంటారని, నంద్యాల మాకు వంద కిలోమీటర్ల దూరమవుతుందని అందుకు నేనే కాదు నియోజకవర్గ ప్రజలెవ్వ‌రూ నంద్యాల జిల్లా అంటే సానుకూలంగా లేరన్నారు. ఈ విషయం పై నంద్యాల పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, చైర్మన్ లు ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు. వీరంతా ఎక్కడున్నారని, ఇప్పటికె నందికొట్కూరు ప్రజలు రాష్ట్ర ప్రయోజనాల కోసం వేలాది ఎకరాలు ఇచ్చారని, నందికొట్కూరు నియోజకవర్గం రైతుల పొలాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి తాగునీరు కూడా నేడు ఉండేది కాదని మండి పడ్డారు. అలాంటి త్యాగాలు చేసిన నియోజకవర్గాన్ని రాజకేయ స్వార్థం కోసం దగ్గరలో ఉన్న కర్నూలు వదిలి నంద్యాల జిల్లాలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మేల్కొనాలన్నారు. ఈ నెల 28న భారీ ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేద్దామని అందుకు నియోజకవర్గ ప్రజల సహకారం కావాలన్నారు. భవిష్యత్ త‌రాలు బాగుపడాలంటే మనమందరం ఇప్పుడు పోరాడాలని, రాష్ట్ర మంత్రులు, నాయకులు పరిపాలించడంలో తీవ్రంగా విఫలమయ్యారన్నారు. నేను నియోజకవర్గంలో రోడ్లు, జి ఎల్ ఎస్ ఆర్ ట్యాంకులు, కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ళు కట్టించామని అందుకే నేటికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ ఇప్పటికీ ఉందన్నారు. ఈ రాష్ట్ర నాయకులు ఎవరైనా అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే ప్రజలతో నేనే సన్మానిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement