Friday, September 20, 2024

KNL: కేంద్ర, రాష్ట్ర పథకాలతో నిరుద్యోగ యువతకు చేయూత.. కలెక్టర్ రంజిత్ బాషా

కర్నూలు బ్యూరో : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాల ద్వారా నిరుద్యోగ పేద యువతకు చిన్న తరహా పరిశ్రమల స్థాపనతో చేయూత‌నందించ‌వ‌చ్చ‌ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో పండిస్తున్న టమోటా, ఉల్లి, తదితర ఉత్పత్తుల మార్కెటింగ్, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలన్నారు.

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా యూనిట్ల స్థాపనకు రూ.10లక్షల రుణం మంజూరులో రూ. 3.50 లక్షల సబ్సిడీ ఉందన్నారు. ఇలాంటి పథకాలను యువత వినియోగించుకునేలా అధికారులు తగిన సహకారం అందజేయాలన్నారు. ఈ పథకం ద్వారా ఆదోని, పత్తికొండ తదితర ప్రాంతాల్లో చిన్న చిన్నటమోటా, ఉల్లి స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. టమోటాను ఒక వారం రోజులు నిల్వ చేయగలిగితే, ఇక్కడి నుండి హైదరాబాద్ కు పంపిస్తే, రైతులకు లాభం కలుగుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఆలోచన చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 20 రోజుల్లోపు ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికతో తన వద్దకు రావాలని కలెక్టర్ మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, డీఆర్డిఏ, హార్టికల్చర్, ఫిషరీస్ అధికారులను ఆదేశించారు.

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా యూనిట్ల స్థాపనకు యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేలా పథకం వివరాలతో పత్రికా ప్రకటన జారీ చేయాలని, అలాగే కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ పథకం కింద రుణాల మంజూరుకు బ్యాంకులు తిరస్కరించిన దరఖాస్తులపై సమీక్ష చేయడానికి సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పీఎంఈజీపీ పోర్టల్ లో ఎల్డీఎం కు యాక్సెస్ ఉండేలా మార్పు చేయించాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

పారిశ్రామిక ప్రోత్సాహకాలు రూ.4.11 కోట్లకు ఆమోదం…
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు సంబంధించిన 53 క్లెయిమ్స్ కు సంబంధించి రూ.4,11,87,512లకు ఆమోదం తెలపడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
పెట్టుబడి రాయితీ క్రింద 34 క్లెయిమ్స్ కు సంబంధించి రూ.3,64,61,414లు, విద్యుత్ ఖర్చు రీయింబర్స్‌మెంట్ క్రింద 12 దరఖాస్తులకు సంబంధించి రూ.17,34,513లు, వడ్డీ రాయితీ రీయింబర్స్‌మెంట్ క్రింద 07 దరఖాస్తులకు సంబంధించి రూ.29,91,585లు పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు.
జనరల్ క్రింద 16, ఎస్సీ క్రింద 30, ఎస్టీ క్రింద 4, ఓబీసీ క్రింద 3, మొత్తంగా 53 క్లెయిమ్స్ కు ప్రోత్సాహకాలు అందజేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, పరిశ్రమ శాఖ జిఎం మారుతీ ప్రసాద్, ఎపిఐఐసి జిఎం సోమశేఖర్ రెడ్డి, ఐలా ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోఆర్డినేటర్ దిలీప్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఐ.నారాయణరెడ్డి, కాలుష్య నియంత్రణ అధికారి ముని ప్రసాద్, ఎల్డిఎం రామచంద్రరావు, మత్స్యశాఖ అధికారి శ్యామల, ఏపీఎంఐపి పిడి ఉమాదేవి, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement