Friday, November 22, 2024

అమాత్య రేసులో హఫీజ్ ఖాన్..! : కర్నూలు జిల్లాలో సర్వత్ర చర్చ

కర్నూలు : మరో రెండు మూడు నెలల్లో నూతన క్యాబినెట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలా కసరత్తు మొదలు పెట్టిన వేళ కర్నూలు జిల్లా నుండి ఏ ఎమ్మెల్యే కు మంత్రి పదవి వరిస్తుందోనన్న చర్చ అధికంగా జరుగుతుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా నుండి మంత్రి పీఠంపై ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కన్నేసినప్పటికీ పోటీ మాత్రం కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఆదోని నుండి వ‌రుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబానికి వైయస్ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. వీటితో పాటు అన్నదమ్ములు ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలుపొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని వీడిన దాఖలాలు లేవు. కాబట్టి సాయి ప్రసాద్ రెడ్డికి ఈసారి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. మరోవైపు గత పది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, వైయస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మినబంటుగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పని చేస్తూ వస్తున్నారు.

2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధపడినా, నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట గౌరవించి ఎస్వి మోహన్ రెడ్డి గెలుపుకోసం పాటుపడ్డారు. మోహన్ రెడ్డి గెలిచిన అనంతరం వైఎస్ఆర్ ను వీడి అధికార తెలుగుదేశం పార్టీలో నాడు చేరారు. అయితే కర్నూల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాటి నుండి గడపగడపకు తిరుగుతూ, ప్రజల మధ్యలో ఉంటూ 2019 ఎన్నికల్లో బలమైన టిడిపి అభ్యర్థి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి తానేమిటో నిరూపించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం మైనారిటీల తరపున గొంతు వినిపిస్తున్న ఏకైక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనే చెప్పవచ్చు. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సబ్జెక్టు ఉన్న నాయకుడిగా హఫీజ్ ఖాన్ కే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా మైనారిటీలు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాకు కర్నూల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హఫీజ్ ఖాన్ కు మంత్రి పదవిని ఇస్తే, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న అభిప్రాయం ముస్లిం మైనార్టీ లో వస్తుందన్న ఆలోచన సైతం ముఖ్యమంత్రి చేస్తున్నట్లు సమాచారం.. ఏది ఏమైనా అమాత్య రేసులో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడనే చెప్పవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement