కర్నూలు పశ్చిమ ప్రాంతం నుండి వలసలు ఆపడానికి కావలసిన చర్యలు చేపడతాం అని ప్రభుత్వం పదేపదే చేసే ప్రకటనలకు, ఆచరణకు పొంతనలేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రెడ్డి విమర్శించారు. శనివారం రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ… ఈ ప్రాంతం నుండి వలసల నివారణకు.. తలాపుననే ప్రవహిస్తున్న తుంగభద్ర నది ఆధారంగా లక్ష యాబై ఒక్క వేయి ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ఎల్ఎల్ సి నిర్మాణం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. కానీ తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు గత పది సంవత్సరాలుగా యాబై వేల ఎకరాలకు కూడా నీరందించని విషయాన్ని ఆయన వివరించారు. ప్రాజెక్టుకు కేటాయించిన నీటి కంటే అదనంగా తుంగభద్ర నదిలో ప్రవహిస్తున్న ఈ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై పాలకుల నిర్లక్ష్యం ఈ ప్రాంతానికి శాపంగా మారిందని బొజ్జా ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సంవత్సరం సుమారు 600 టీఎంసీల తుంగభద్ర జలాలు శ్రీశైలం రిజర్వాయర్ చేరినప్పటికి, ఎల్ఎల్ సి ఆయకట్టులో సగానికి కూడా సాగునీరు అందంచలేకపోయారని తెలిపారు.
ఎల్ఎల్ సి ఆయకట్టుకు నీరందించకుండా, ఈ ప్రాజెక్టుకు తుంగభద్ర డ్యాంలో హక్కుగా ఉన్న నీటి నుండి 2 టిఎంసీలు తుంగభద్ర ఎగువ కాలువకు మళ్ళింపుకు జలవనురుల శాఖ ప్రతిపాదనలు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి స్థాయిలో ఎల్ఎల్ సి ఆయకట్టుకు నీరందించలేక, ఈ ప్రాజెక్టుకు హక్కుగా ఉన్న నీటిని ఇతర ప్రాజెక్టులకు మళ్ళించడం జలవనరుల శాఖ వైఫల్యం అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఒక కరువు పీడిత ప్రాంత నీటి హక్కులను ఇంకొక కరువు పీడిత ప్రాంతానికి మళ్ళించే ప్రతిపాదనలతో కాలయాపన చేయడం, చేతులు దులుపుకోవడం మానేసి, కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, ఆర్ డిఎస్ కుడి కాలువ లాంటి తదితర సాగునీటి వ్యవస్థల అభివృద్ధిపై పాలకులు దృష్టి కేంద్రీకరించి వలసలు ఆపాలని హితవు పలికారు. ఈ సమావేశంలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, ఏర్వ రామచంద్రా రెడ్డి, కోశాధికారి చెరుకూరి వెంకటేశ్వర నాయడు, సభ్యులు పట్నం రాముడు, కొమ్మా శ్రీహరి, రామిరెడ్డి, రాఘవేంద్ర గౌడ్, భాస్కర్ రెడ్డి, ప్రజా సంబంధాల కార్యదర్శి నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.