గణేష్ నిమజ్జన మహోత్సవ సందర్భంగా కర్నూల్ నగర తొలి విగ్రహం రాంబోట్ల స్వామి గుడి దగ్గర.. స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మేయర్ బివై రామయ్య, ఎంపీ సంజీవ కుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, కమిషనర్ భార్గవ్ తేజ లు ప్రారంభించారు. కర్నూలు నగరంలో వినాయక చవితి 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా సాగాయి. కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగను జరుపుకున్నారు. నగరంలో గణనాథులు నిమజ్జనానికి కదిలాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఎవరూ సరిగ్గా జరుపుకోలేకపోయారు. అందుకే ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించిన గణేష్ నిమజ్జనం మహోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కర్నూలు నగరంలో 2500 వరకు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రతి వాడలో ఉన్నటువంటి విగ్రహాలకు ఐడీ నెంబర్ ను కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న విగ్రహాల సంఖ్యను బట్టి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
మొదటి ప్రారంభమయ్యే నిమజ్జన యాత్ర ఎక్కడంటే ?
కర్నూలు నగరంలో ఉదయం 9 గంటలకు రాంబట్ల దేవాలయం నుంచి వినాయక నిమజ్జన యాత్ర ప్రారంభమైంది. చాలా ఏళ్లుగా వస్తున్న ఆచార, సాంప్రదాయాల ప్రకారం మొదటగా ఆ వినాయకుడిని నిమజ్జనం చేశాకే.. మిగతా విగ్రహాలకు నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తారు. మొదటగా ఆ విఘ్నేశ్వరుడు పూజలు అందుకున్నాకే.. రాంబట్ల దేవాలయ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనానికి బయల్దేరారు. తర్వాత కర్నూల్ లో ఉన్నటువంటి అన్ని వినాయకులు నాలుగు దిక్కుల నుండి నిమజ్జన ఘాటుకు తరలివచ్చాయి. ముఖ్యంగా పాత బస్టాండ్, ఆర్ఎస్ రోడ్డు, కొత్త బస్టాండ్, బిర్లాగేట్, నంద్యాల చెక్ పోస్ట్, గుత్తి పెట్రోల్ బంక్ నుండి రూట్ మ్యాప్ ద్వారా నిమజ్జనానికి గణనాథులు తరలివచ్చారు. పోలీసు సూచనలు పాటిస్తూ వినాయక నిమజ్జనం ర్యాలీ కొనసాగింది. ఊరేగింపులో డీజే సౌండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న విగ్రహ కమిటీ సభ్యులు వారి గణేష్ విగ్రహం వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా బాధ్యత తీసుకుంటూ ఊరేగింపు నిర్వహించారు, పోలీసులకు సహకరించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రజలు సహకరిస్తూ వచ్చారు. డీజేలు అనుమతి ఉన్నప్పటికీ… రాత్రి 12 గంటల వరకు మాత్రమే డీజేలు ఉపయోగించాలా పోలీసుల అనుమతించారు. డీజేలను నిలిపివేయాలని పైన సూచించిన నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎస్పీ కౌశల్ తెలిపారు.
పోలీసుల వలయంలో కర్నూలు నగరం..!
నగరంలో 2000 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గొడవలకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకోవడం కోసం పోలీసులు పహారా కాస్తున్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకూ దిశానిర్దేశం చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలతో ఏ విధంగా మెలగాలనే అంశాలపై సూచనలు చేశారు.
కేసీ కెనాల్ చుట్టూ 7 క్రేన్ల ఏర్పాటు…!
కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో 7 క్రేన్లను ఏర్పాటు చేశారు. విగ్రహాల ఎత్తు వాటి ప్రాధాన్యతను బట్టి పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడబోతున్నారు. గత సంవత్సరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడు క్రేన్ల సంఖ్యను పెంచారు. గతంలో మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిమజ్జనం జరిగేది. కానీ ఇప్పుడు అది పునరావృతం కాకుండా చూడాలని.. ప్రస్తుత రోజుల్లో నగరంలో ఎక్కువ విగ్రహాలు ఉండటం వల్ల నిమజ్జనం కార్యక్రమం త్వరగా ముగించాలని క్రేన్ల సంఖ్యను కూడా పెంచారు. నిమజ్జనాన్ని పురస్కరించుకొని దాదాపుగా 600 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. అలాగే నిమజ్జనానికి ప్రభుత్వ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని తెలియజేశారు. ఈ నిమజ్జనం ఉదయం 9 గంటలకు మొదలుకుని నిర్విరామంగా జరుగుతుందని పోలీసులు భావించారు. అయితే వర్షం కారణంగా ఉదయం 10 గంటల తర్వాత కార్యక్రమం ప్రారంభమైంది. జోరు వర్షం కురుస్తున్న లెక్కచేయకుండా ప్రజాప్రతినిధులు, వినాయక భక్తులు మొదట రాంబోట్ల దేవాలయం వద్ద పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.