Sunday, November 24, 2024

మే 10వరకు రైతులకు సాగునీరివ్వాలి.. బుడ్డా రాజశేఖర్ రెడ్డి

వెలుగోడు : మే 10వ తేదీ వరకు తెలుగుగంగా రిజర్వాయర్ కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాల‌ని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూర్, మహానంది రైతులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలుగు గంగ డీఈ రమేష్ బాపూజీకి మే 10వ తేదీ వరకు క్రమం తప్పకుండా తెలుగుగంగ చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరందించాల‌ని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జిమ్మిక్కులతో రైతాంగం నష్టపోయారన్నారు. తెలుగుగంగ‌ జలాశయంలో 12టీఎంసీల నీరు నిలువ ఉన్న రైతుల పంటల అవసరాలకు సాగునీరు అందించడంలో అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నీటి వృధా కాకూడదనే ఉద్దేశంతో సున్నా కిలోమీటర్ నుండి 18వ కిలోమీటర్ వరకు లైనింగ్ పనులను ప్రభుత్వం నుండి మంజూరు చేయించుకుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి కమీషన్ల కోసమే పనులను మంజూరు చేయించుకున్నారని ఆరోపించారన్నారు.

అప్పటి టెండర్లను రద్దు చేయించి మరల టెండర్లను వేసి కమీషన్లు తీసుకుంటున్నది ఎవరో ప్రజలకు తెలియదనుకుంటున్నారా అని ఆయన అన్నారు. రైతుల పంటలకు సాగునీరు అందించకపోతే రైతు పక్షాన పోరాటానికి తాను సిద్ధమన్నారు. జలాశయంలో నీటి నిలువలు సమృద్ధిగా ఉన్న నంద్యాల జిల్లా రైతులను అన్యాయం చేసి కడపకు తరలిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. రైతులకు సాగునీరు అందించడానికి చేతకాకపోతే తప్పుకుంటే తాము ప్రతి రైతు పైరుకు పంట వచ్చేవరకు సాగునీరు అందిస్తామన్నారు. గంగ అధికారులు రిజర్వాయర్ నుండి 15 రోజులు నీటిని విడుదల చేసి 15 రోజులు ఆపేస్తామంటే రైతులు పంటలు పండించుకోవడం కష్టమవుతుందన్నారు. జలాశయం నుండి నిరంతరంగా 700 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే రైతులందరూ పంటలు పండించుకోవచ్చన్నారు. ఈ విషయమై తాను తెలుగుగంగ ఎస్సి నీ, జిల్లా కలెక్టర్ ను కలిసి రైతులకు నీటి విడుదలపై చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నారపు శేషి రెడ్డి, బన్నూరు రామలింగారెడ్డి, సురేష్ రెడ్డి, ముల్లా అబ్దుల్ కలాం, మోమిన్ రసూల్ కలిలుల్లా ఖాన్, అమీర్ హంజ, భూపాల్ యాదవ్, గాండ్ల శివన్న, హీదాయత్ అలిఖాన్, నాలుగు మండలాల నాయకులు, రైతులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement