Friday, November 22, 2024

కర్నూలు జిల్లాలో ర‌స‌వ‌త్త‌రంగా ఎన్నికలు

రాజకీయంగా ఎదగాలంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గుకు రావాలి.. అదే భవిష్యత్‌, రాజకీయ ఎదుగుదలకు పునాది అవుతుంది. అందుకే కర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఘట్టంలో మొదటి అంశం ముగిసింది. నామినేష్ల దాఖలు అంశం ముగిసే సరికి జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న రెండు జడ్పీటీసీస్థానాలకు మొత్తం 17 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో కొలిమిగుండ్ల జడ్పీటీసీ స్థానంకు 3 దాఖలు కాగా, వైఎస్‌ఆర్‌ సిపి నుంచి 2, ఇండిపెండెంట్‌గా ఒకరు నామినేషన్‌ వేశారు. నంద్యాల జడ్‌పి స్థానానికి బీఎస్పీ నుంచి 6, బీజేపీ నుంచి 7, టీడీపీ 12, వైకాపా 13, జనసేన నుంచి మొత్తం14 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక జిల్లాలో సర్పంచ్‌లకు సంబంధించి యనగండ్లకు 4, లక్కసాగరంకు 8, తిమ్మాపురం సర్పంచ్‌ స్థానానికి మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 21 వార్డు పరిధిలో మొత్తం 33 నామినేషన్లు దాఖలయ్యాయి.


మున్సిపాలిటీలకు పోటా పోటీ : మున్సిపల్‌ ఎన్నికలకు సంబందించి కూడా పోటా పోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఎమ్మిగనూరు మున్సిపాలిటి 10వ వార్డుకు 2 నామినేషన్లు దాఖలు కాగా, రెండు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచే దాఖలయ్యాయి. ఇక నందికొట్కూరు మున్సిపాలిటి పరిధిలో 10 వార్డులకు 8 నామినేషన్లు దాఖలవ్వగా, ఇందులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2, టీడీపీ నుంచి 3, ఇండిపెండెంట్‌ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు.
బేతంచర్ల పంచాయతీకి 131 నామినేషన్లు : బేతంచర్ల నగర పంచాయితీ పరిదిలో మొత్తం 20 వార్డులకు 131 నామినేషన్లు దాఖలు కాగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి 41, టీడీపీ నుంచి 64, జనసేన నుంచి10 మంది నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు.


రంజుభలే రాజకీయం :
జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి పోటీదారులు అధికంగా ఉన్నారు. వాస్తవంగా కర్నూలు జిల్లాకు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో ఫ్యామిలి రాజకీయాలు ఓ ఎతైతే.. రాజకీయంగా ఎదగాలన్న ఆరాటం మరో ఎత్తు.. దీంతో జిల్లాలో మిగిలిన పంచాయితీ ఎన్నికల్లో పోటీ తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా బేతంచెర్ల మున్సిపాలిటీకీ జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసుందుకు అభ్యర్థుల్లో ఉత్సాహం అధికంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం ఇక్కడి ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్ధుల్లో ఎక్కువగా వైసీపీ, టీడీపీ నేతలే అధికంగా ఉన్నారు. అయితే మాకంటూ.. మాకంటూ ఆయా పార్టీల నుంచి టికెట్‌ కోసం పోటీ రేసులో ఉన్నారు. ఈ పరిస్థితి ఆయా నియోజక వర్గాల ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్యేల‌కు, అగ్రనేతలకు తలనొప్పులు తెప్పిస్తున్నది. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు కానీ, ప్రస్తుత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్ధితులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ తరుపున అభ్యర్ధులను రంగంలో దించుతుంది. ఎన్నడు లేని విధంగా ప్రస్త్తుతం ఎన్నికలు జరుగుతున్న పంచాయితీలు, జడ్‌పిటిసి, ఎంపిటిసికి సంబందించి మిగిలిన స్థానాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే ముఖ్యమంత్రి వద్ద వారికి మార్కులు పడే అవకాశం ఉంది. ఇక టీడీపీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలని చేస్తోంది.

- Advertisement -


ఎత్తులకు పై ఎత్తుల్లో ప్రతిపక్షం :
గత ఎన్నికల్లో అధికార పార్టీ తప్పుడు విధానాలతో వ్యవహరించిందని ఎన్నికలను బహిష్కరించిన పార్టీ, గత రెండు మూడు నెలల్లో అధికార పార్టీపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగింది. ఆయా నియోజక వర్గాల ఇన్‌ఛార్జిలపై ప్రధాన బాధ్యత ఉంచుతున్నది. ప్రస్తుత ఎన్నికల్లో తమ మద్దతు దారులే విజయం సాధిస్తారని ప్రధానంగా వైసీపీ, టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏక గ్రీవంగా పంచాయతీలను కైవసం చేసుకునేందుకు వారు పావులు కదుపుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రస్తుతం గెలుపు గుర్రాలు ఎవరనే అంశంపై అన్ని కోణాల్లో ఆలోచన చేసే క్రమంలో పార్టీ ప్రధాన నేతలు పడ్డారు. నామినేషన్ల పరిశీలన, విత్‌ డ్రా చేసేందు కు మరో రెండు రోజులు గడువు ఉంది. గడువు ముగిసే సమయానికి ఎవరూ విత్‌ డ్రా చేసుకుంటారు, ఎవరూ కదన రంగంలో ఉంటారు. ఆయా చోట్ల పోటీ ఎలా ఉంటుంది. ఓటర్లు అధికార పార్టీ సంక్షేమంకు పట్టం కడతారా, లేక ప్రతిపక్షం విమర్శలకు అనుగుణంగా ఓట్లు వేస్తారా అన్న అంశాలపై పూర్తి స్థాయిలో బేరిజు వేయాలంటే కొంత సమయం ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement