డోన్ ప్రజల అభిమానానికి కొలమానం లేదని, 2014, 2019లో వరుసగా రెండుసార్లు విజయం సాధించడమే అందుకు నిదర్శనమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్ పట్టణం 17వ వార్డులో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలిచ్చిన అవకాశం వల్లే డోన్ లో వ్యవసాయ, నీటిపారుదల, విద్య, వైద్య తదితర రంగాల అభివృద్ధి సాధించామన్నారు. అన్ని ప్రాంతాలు, వర్గాలు బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలనేదే ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు. డోన్ నియోజకవర్గానికి ఏ లోటు లేకుండా చేయాలనేది తన తపన అన్నారు. పార్టీ కోసం పని చేసిన ఏ ఒక్కరినీ వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదన్నారు. ఇప్పటికే చాలా మంది శ్రమను గుర్తించి వారికి తగిన స్థానం పార్టీ కల్పించడం జరిగిందన్నారు.
కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత న్యాయం చేయడమే ముఖ్యమంత్రి సిద్ధాంతంగా పేర్కొన్నారు. అంతకుముందు బేతంచెర్ల పట్టణంలో 3వ కొత్త సచివాలయం భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల లబ్ధి గురించి వివరిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి ఓ అవ్వ ఆత్మీయంగా పలకరించడం గమనార్హం. అనంతరం డ్రోన్ పైలెట్ ట్రెనింగ్ పూర్తి చేసుకుని ఎంపికైన 2వ బ్యాచ్ పైలట్ లకు నియామక పత్రాలను మంత్రి బుగ్గన అందజేశారు. బీసీ కార్పొరేషన్ స్టేట్ కమిటీని కొనసాగించినందుకు ఆర్థిక మంత్రిని కలిసి సచివాలయ కన్వీనర్లు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సమక్షంలో డోన్ పట్టణ మార్కెట్ యార్డు కమిటీ కొత్త చైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తి చేయడం విశేషం.