కర్నూలు : కర్నూలు జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద జనవరి – మార్చి – 2022 త్రైమాసికానికి సంబంధించి 46,023 మంది విద్యార్థులకు గాను 41,156 మంది తల్లుల ఖాతాల్లో రూ.25.52 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి వేదిక నుండి బటన్ నొక్కి జనవరి – మార్చి – 2022 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన లబ్ధి మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య,ఆదోని మునిసిపల్ చైర్ పర్సన్ బోయ శాంత, డిసిఎంఎస్ చైర్ పర్సన్ శిరోమణి, సంక్షేమ శాఖల అధికారులు, విద్యార్థుల తల్లులు పాల్గొని తిలకించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…. పేద విద్యార్థులకు ఫీజు కష్టాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, అమ్మబడి పథకాలతో ప్రభుత్వం పేద విద్యార్థులకు అండగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. చదువుకోవాలనే పట్టుదల ఉండి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకోలేని ప్రతి పేద విద్యార్థి ఉన్నతంగా చదువుకోవాలి అన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ , పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి , కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్యలు పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement