నందికొట్కూరు : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రహదారిలో వేణు (27), కళ్యాణి (24) దంపతులు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. వేణు స్థానికంగా ఒక హోటల్ లో టీ మాస్టర్ గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి తలుపు వేసుకుని ఇంట్లో ఉన్న దంపతులు ఆదివారం 11 గంటలైనా ఇంట్లో నుండి ఎవరు బయటకు రాకపోవడంతో కాలనీ వాసులు ఇంటి వద్దకు చేరుకుని కిటికీ నుండి చూశారు. వేణు ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఉండగా, కళ్యాణి మంచం దగ్గరే రక్తపు మడుగులో పడివుంది. దంపతులిద్దరూ మృతి చెంది విగతజీవులుగా పడివుండటాన్ని చూసి స్థానికులు పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎన్ వి రమణ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ… కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎందుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎన్ వి రమణ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital