.కర్నూల్ బ్యూరో-.జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినా కరోనా కట్టడి సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మరింత రెట్టిపు వేగంతో సెకెండ్ వేవ్ దూసుకొస్తోంది. జిల్లా వ్యాప్తంగా కేసులను పరిశీలిస్తే యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది.. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో విద్యా సంస్థలు కరోనాకు హాట్ స్పాట్ లు గా మారాయి. తాజాగా జిల్లాలో 53 మంది విద్యార్థినీలకు కరోనా సోకింది. ఆదోనిలోని కస్తూర్బా గాంధీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులలో 53 మంది విద్యార్థినిలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేకాదు పాఠశాల ప్రిన్సిపాల్ శాంతి సైతం దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో మరింత మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందరికీ పరీక్షలు చేస్తే పరిస్థితి తెలుస్తుంది.ప్రస్తుతం కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను అందరినీ ఐసోలేషన్ కు పంపారు వైద్యాధికారులు. పాఠశాల సముదాయంలోనే ప్రత్యేకంగా ఒక గధిని ఐసోలేషన్ సెంటర్ గా మార్చి.. అందరికీ చికిత్స అందిస్తున్నారు. అయితే అంతా ఆరోగ్యంగానే ఉన్నారని ఎవరికి ఇబ్బంది లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆదోని కస్తూరి భా స్కూల్ లో మొత్తం 300 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 53 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మిగిలిన విద్యార్థుల్లో కూడా ఆందోళన మొదలైంది.
విద్యార్థులకు కోవిడ్ పై మంత్రి ఆరా
కర్నూల్ జిల్లా ఆదోని కస్తూరి భా స్కూల్ లో మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. కర్నూల్ జిల్లా డీఎంహెచ్ఓ రామ గిడ్డయ్య తో ఆయన ఫోన్ లో మాట్లాడారు . వెంటనే కస్తూరి భా స్కూల్ లో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధ్యాయులకు, ఇతర విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా నివారణకు ముందోస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అయితే జిల్లాలోని పలు విద్యాసంస్థలలో అధికంగా కరోనా వ్యాప్తి చెందుతుండడం విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన పెంచుతోంది. కొన్ని రోజుల కిందట ఆదోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థులకు, ఏడుగురి సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే చాగలమర్రి కేజీబీవీలో 22 మంది విద్యార్థులు కరోనా బారిన పడటం గమనార్హం. అలాగే కర్నూలు ఏ క్యాంపు లోని ఇందిరాగాంధీ నగరపాలక పాఠశాలలో 27 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు వైరస్ సోకింది. ఇక శుక్రవారం కోడుమూరు 70 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా ముగ్గురికి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇదే రోజు పగిడ్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో 70 మంది విద్యార్థునులకు కోవిడ్ టెస్టులు చేయగా ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రతి రోజు నమోదు అవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువమంది విద్యార్థులే ఉంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా గత 17 రోజుల్లో జిల్లాలోని అనేక విద్యాసంస్థలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటివరకు 415 మంది విద్యార్థినీ, విద్యార్థులు 84 మంది ఉపాధ్యాయ, సిబ్బంది కి పాజిటివ్ గా తేలింది. పాఠశాలలు, వసతిగృహాల తో పాటు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 11 ప్రభుత్వ,ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ సిద్ధం చేశామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.అయితే కరోనా కేసులు బడులను వణికిస్తున్న డంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఇతర రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉండడంతో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. కీలక పరీక్షలు సైతం రద్దు అయ్యాయి. ఆయా విద్యార్థులను తరువాత క్లాస్ లకు ప్రమోట్ చేశారు. పదో తరగతి సీబీఎస్ఈ పరీక్షలను సైతం కేంద్రం రద్దు చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని చెబుతోంది. అయితే అత్యధికంగా కేసులు నమోదైన విద్యాలయాలను మాత్రం మూసేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల్లో మాత్రం భయం పెరుగుతోంది. తమ పిల్లల ఆరోగ్యం పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను మూసివేయాలనే డిమాండ్ పెరిగింది. పరీక్షలను కూడా రద్దు చేయాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు. దీనిపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరీ ఈ స్థాయితో విద్యా సంస్థల్లో కరోనా పెరుగుతుంటే ప్రభుత్వానికి ప్రత్యమ్నాయాలు కూడా ఉండవు.