Friday, November 22, 2024

కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్ర‌శాంతం.. 22630 మంది హాజరు..

నగరంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్
కర్నూల్ : కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరి రాత పరీక్ష ఆదివారం కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభం అయ్యింది.
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జరుగుతున్న సందర్భంగా కర్నూలు ఏ క్యాంప్ మాంటిసోరి పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 పరీక్ష కేంద్రాల్లో 22630 అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు. పరీక్ష కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులు పోలీసు కానిస్టేబుల్ కావాలన్న తలంపుతో పెద్ద సంఖ్యలో పరీక్షలకు హాజరు కావడం విశేషం. దీంతో కర్నూలు జిల్లాలో పోలీస్ రాతపరీక్ష నిర్వహించే కేంద్రాల వద్ద అభ్యర్థులు కిక్కిరిసిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిధిలో వేల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ రాసేందుకు పోటీపడ్డారు. రీజనల్ కో ఆర్డినేటర్ల పర్యవేక్షణలో సీలు వేసిన ప్రశ్నా పత్రాల బాక్సులను ప్రత్యేకంగా కేటాయించిన బస్సులలో ఆయా పరీక్షా కేంద్రాలకు పంపారు. నగరంలో ఉన్న మొత్తం 48 పరీక్షా కేంద్రాలను రూట్లుగా విభజించి ఒక్కో రూటుకు మొబైల్ పార్టీతో పాటు సి.ఐ ల నేతృత్వంలో ఎస్కార్ట్ వాహనాల్లో పోలీసు సిబ్బంది ప్రశ్నా పత్రాల తరలింపు సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు వ్రాత పరీక్ష కొనసాగనుంది.

నంద్యాల జిల్లాలో
స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలో భాగంగా నంద్యాల జిల్లాలో 33 పరీక్ష కేంద్రాల పరీక్ష నిర్వహించారు. ఏపీఎస్ఎల్ఆర్బి నియమ నిబంధనల మేరకు మాల్ ప్రాక్టీస్, కాఫీయింగ్, తదితర అక్రమాలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. అభ్యర్థులందరినీ ఫ్రిస్కింగ్ చేసిన అనంతరం పరీక్ష కేంద్రం లోనికి అనుమతి ఇవ్వడం జరిగింది. సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్ , తదితర ఎలెక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మ‌హిళా అభ్యర్థుల ఫ్రిస్కింగ్ కొరకు ప్రత్యేక తాత్కాలిక గదులు ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారం చెక్ చేశారు. ప్రతి సెంటర్ కి దాదాపు పది మంది సిబ్బంది, ఒక ఎసైని పర్యవేక్షణ నిమిత్తం నియమించారు. సీఐ డిఎస్పిలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మొత్తంగా నంద్యాల జిల్లాలో పోలీసు రాత పరీక్షకు 17,331 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరిలో పురుషులు 13142 మంది ,మహిళా అభ్యర్థులు 3092 మంది పరీక్ష రాయగా, 1092 మంది గైరాజరయ్యారు. నంద్యాల ఎస్పీ రఘురాం రెడ్డి పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement