Tuesday, November 19, 2024

Nandyala: బండిఆత్మకూరు మండలంలో కలెక్టర్ అకస్మిక తనిఖీలు

పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్ మండిపాటు
బండి ఆత్మకూరు, జులై 18 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి బండిఆత్మకూరు మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం ఆమె స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ చేసి వైద్య సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేసి, అక్కడ ల్యాబ్ ను పరిశీలించారు. అక్కడ రోగులతో మాట్లాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం రికార్డులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం కస్తూరిబా పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. విద్యార్థినీలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి గత ఏడాది ఉత్తీర్ణత శాతంపై ఆమె ఆరా తీసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అక్కడి సిబ్బందిని ఆదేశించారు. తర్వాత అక్కడే ఉన్న అంగన్వాడీ సెంటర్ ను తనిఖీ చేసి రికార్డు నిర్వహణపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికైనా రికార్డులు పకడ్బందీగా నిర్వహించాలని ఆమె ఆయా శాఖల సిబ్బందిని హెచ్చరించారు.

బండి ఆత్మకూరు పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్ మండిపాటు….
మండల కేంద్రమైన బండి ఆత్మకూరులో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని జిల్లా కలెక్టర్ మండిపడ్డారు. ఆకస్మిక పర్యటనలో భాగంగా ఆమె మండల కేంద్రంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన మురుగు కాలువలు, చెత్త, చెదారం, ప్రజలు నిత్యం నడిచే దారుల్లో ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉండడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా పారిశుధ్య పనులు చేపట్టి వీధులన్నీ శుభ్రం చేయించాలని ఆమె ఇన్చార్జి ఎంపీడీవో హనీఫ్ ఖాన్ ను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement