Wednesday, November 20, 2024

AP: కొత్త దంప‌తుల‌కు జ‌గ‌న్ ఆశీర్వాదం

కర్నూలు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. గురువారం ఉదయం కోడుమూరురోడ్డులోని కింగ్స్‌ ప్యాలెస్‌ గ్రాండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో వరుడు పవన్‌ కళ్యాణ్‌ రెడ్డి, వధువు కీర్తన రెడ్డిలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం ఉదయం తొలుత గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారాయన. అక్కడి నుంచి కోడుమూరురోడ్డులోని వివాహ వేదికకు వెళ్లారు. అక్కడ వివాహ వేడుకకు హాజరై.. నూతన వధువరులను ఆశీర్వదించారు.

అంత‌కు ముందు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉదయం 11.00 గంటలకు చేరుకున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్.విజయరావు, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, బనగానపల్లి శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు డా.సుధాకర్ త‌దిత‌రులు స్వాగ‌తం ప‌లికారు.

సాయంత్రం ఫిరంగిపురంలో వాలంటీర్లుకు అవార్డుల ప్ర‌ధానోత్స‌వం ..
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నేటి సాయంత్రం సీఎం జగన్ ఇవాళ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవావజ్ర పురస్కారాలు అందిస్తారు. బ్యాడ్జ్, మెడల్, 45,000 రూపాయల నగదు ఇస్తారు. 4,150 మందికి సేవారత్న పురస్కారాలు అందిస్తారు.

- Advertisement -

ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని పెంచింది. సేవా వజ్ర పురస్కారం మొత్తం గతంలో రూ.30 వేలు ఉండగా నేటి నుంచి రూ.45 వేలు అందుతాయి. సేవా రత్నకు రూ.20 వేల పురస్కారం ఉండగా నేటి నుంచి రూ.30 వేలకు పెరుగుతుంది. సేవా మిత్ర పురస్కారానికి అందించే రూ.10 వేలను రూ.15 వేలకు పెంచారు. ఏపీలో మొత్తం 2,55,464 మందికి రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement