Thursday, November 21, 2024

ఆత్మకూరు సహా 10 రాష్ట్రాల్లో ఉప-ఎన్నికల నగారా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇటీవలికాలంలో వివిధ కారణాలతో పార్లమెంట్ సహా పలు రాష్ట్రాల శాసనసభల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జాబితాలో మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాలమరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గంతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భగవంత్‌సింగ్ మాన్ వదులుకున్న సంగ్రూర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నాయి. మొత్తం 6 రాష్ట్రాల్లో 2 పార్లమెంట్ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రకారం మే 30న నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్లు స్వీకరించేందుకు జూన్ 6ను చివరి తేదీగా నిర్ణయించగా, ఆ మర్నాడు నామినేషన్ల పరిశీలన జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ జూన్ 9. జూన్ 23న పోలింగ్, 26న కౌంటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఉపఎన్నికలు జరగనున్న 6 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (ఆత్మకూరు అసెంబ్లీ సీటు)తో పాటు పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ (ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సీట్), త్రిపుర (4 అసెంబ్లీ స్థానాలు), ఢిల్లీ, జార్ఖండ్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement