అగ్నిపథ్ రద్దు చేయాలంటూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలు భారత్ బంద్ పిలుపు మేరకు కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలో బంద్ పాక్షికంగా కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. మిగిలిన ప్రైవేట్, వాణిజ్య కార్యాలయాలు తెరచుకున్నాయి. ఇక ఆర్టీసీ యధావిధిగా బస్సులను తిప్పింది. దీంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కాగా భారత్ బంద్ నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలోని రైల్వే స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం గమనార్హం.
ఎలాంటి సంఘటనలకు తావులేకుండా ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద దాదాపు 500 మంది పోలీసులు పహారా కాశారు. చుట్టుపక్కల ప్రాంతాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోహరించడం జరిగింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో ప్రధాన కూడళ్ళలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్, లాడ్జిలో, వివిధ వాహనాలను విస్తృతంగా తనిఖీ చేపట్టారు. వీటితో పాటు ప్రధాన కూడళ్ళలో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీసులు డేగ కన్ను వేశారు.. అలాగే బాడీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ మొబైల్ వాహనాలు విస్తృతంగా నగరాల్లో తిరుగుతూ బందోబస్తు పర్యవేక్షణ చేశారు.