నంద్యాల : నికరజలాలు ఉన్నప్పటికీ స్థిరీకరణ ప్రాజెక్టులు లేక దశాబ్దాలుగా సగం నీరు కూడా వాడుకోలేని దుస్థితిలో రాయలసీమ సమాజం ఉన్నదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర ఉన్న కె.సి.కెనాల్ కు కేవలం సుంకేశుల దగ్గర 1.2 tmcల నీరు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం వుందనీ, కె.సి.కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలని, తుంగభద్ర ఎగువ కాలువ స్థిరీకరణకు తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, తుంగభద్ర దిగువ కాలువ స్థిరీకరణకు వేదవతి ఎత్తిపోతల పథకం, ప్రజల హృదయ స్పందనైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం అనేక ఉద్యమాలు జరిపామన్నారు. దీనికి పాలకులు గానీ లేదా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు గానీ రాయలసీమ ప్రజల ఆకాంక్షల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధిని చూపలేదని ఆయన విమర్శించారు. రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్య వైఖరిని నిరసిస్తూ ప్రజలే నాయకులై సిద్దేశ్వరం అలుగు శంఖుస్థాపన చేసినా కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలు మొద్దు నిద్రపోతూ రాయలసీమ సమాజం పట్ల వివక్షతను చూపుతున్నారని ఆయన విమర్శించారు. అప్పర్ భద్ర రిజర్వాయర్ కు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి, నిధులు కేటాయింపులు చేయడంతో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతున్న రాజకీయ పార్టీలు రాయలసీమకు హక్కులన్న నీటిని సక్రమంగా వినియోగించు కొనడానికి చేపట్టాల్సిన స్థిరీకరణ ప్రాజెక్టులపై గళం విప్పకుండా పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీశైలం రిజర్వాయర్ కాలి చేసి, నీటిని సముద్రం పాలు చేస్తున్న రాజకీయ పార్టీలు గుడ్లు అప్పగించి చోద్యం చూస్తున్నారే తప్ప రాయలసీమ బాసటగా నిలబడలేదని తీవ్రంగా విమర్శించారు. అధికార పక్షంతో కలిపి, రాజకీయ పార్టీలన్ని పోలవరం, అమరావతి, మూడు రాజధానులు, విశాఖ ఉక్కుల మీదే గళం వినిపిస్తున్నారే గానీ కరువుతో సహజీవనం చేస్తూ, వలసల దారి పట్టిన రాయలసీమ సమాజం గురించి, వారి బాగోగుల గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని దశరథరామిరెడ్డి విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం 2020 , డిసెంబర్ 24 న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు మంజూరు చేస్తే, కేంద్ర జలశక్తి శాఖ ఈ ప్రాజెక్టుకు 25-3-2021 న అనుమతులు ఇచ్చిందన్న విషయం కూడా తెలీదంటున్న అధికార పక్షం, రాజకీయ పార్టీలు ఉండటం మన దౌర్భాగ్యం అని తీవ్రంగా విమర్శించారు. అధికారపక్షం, ప్రతిపక్షం తో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారే తప్ప నికర జలాల స్థిరీకరించేందుకు ప్రాజెక్టుల సాధనకు ఏ మాత్రం నోరు మెదపని ఈ రాజకీయ పార్టీల నిర్లక్ష్య వైఖరిని ప్రజలందరూ ఎండగట్టాలని ఆయన కోరారు. వాస్తవంగా పదేళ్ళ కిందటే అప్పర్ భద్రకు నీటి కేటాయింపులు చేస్తూబ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నివేదికను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఈ కేటాయింపులకు చట్టబద్దత (నోటిఫై కాలేదు)లభించలేదన్నారు. చట్టబద్ద హక్కులులేని ప్రాజెక్టుకు రెండు సంవత్సరాల క్రిందటే కేంద్ర జలవనరుల సంఘం అనుమతులిచ్చిన దీనిపై పోరాడని పాలకులు, రాజకీయ పార్టీలు… ఇప్పుడేమో అప్పర్ భద్ర వల్ల రాయలసీమకు అన్యాయం అంటూ గగ్గోలు పెడుతూ, మొసలికన్నీరు కారుస్తున్నాయన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు హక్కుగా ఉన్న నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి చేపట్టాల్సిన సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి ఎత్తిపోతల పథకాల సాధనకు పోరాడని రాజకీయ పార్టీలు పోరాడాలని హితవు పలికారు.