కర్నూలు జిల్లా… దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 24 వ తేది మంగళవారం రాత్రి కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టిందని కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ తెలిపారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బన్ని ఉత్సవానికి 1000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో అడిషనల్ ఎస్పీ ఒకరు , 9 మంది డిఎస్పీలు, 29 మంది సిఐలు, 66 మంది ఎస్సైలు, 155 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళు, 377 మంది కానిస్టేబుళ్ళు, 48 స్పెషల్ పార్టీ బృందాలు, 2 పట్లూన్ల ఎపిఎస్పీ బలగాలు, 185 మంది హోంగార్డులు బన్ని ఉత్సవం బందోబస్తు విధులలో పాల్గొంటారని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసిందన్నారు. బన్ని ఉత్సవంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, అల్లర్లు, నిప్పులు విసరడం వంటివి సృష్టిస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించడానికి 100 Night vision సిసి కెమెరాలు, 600 LED లైట్లు, డ్రోన్ కెమెరా, విడియో కెమెరాల ను వినియోగిస్తున్నారు. బన్ని ఉత్సవంలో మద్యం సేవించి రింగులు గల కర్రలతో ఉత్సవంలో పాల్గొనడం వల్ల తలలకు గాయాలు కావడం వంటి దుష్పరిమాణాలపై దేవరగట్టు చుట్టు ప్రక్కల 15 (నెరణికి,కోత్తపేట, అరికెర, ఎల్లార్తి,) గ్రామాలలో పోలీసు మరియు రెవిన్యూ శాఖల సమన్వయంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. 10 గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. నాటుసారా, కర్ణాటక లిక్కర్ ను సీజ్ చేయడం జరిగింది. ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ఇంతకు మునుపు ఘర్షణల్లో పాల్పడ్డ వారిని మరియు అక్రమ మద్యం రవాణా చేసే వారిని గుర్తించి 100 మందిని బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఉత్సవంలో ఏలాంటి రక్త గాయాలు కాకుండా పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహాకరించాలని, భక్తుల్లో మార్పు రావాలని, ఈ కర్రల సమరానికి స్వస్తి పలకాలని దేవరగట్టు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ విజ్ఞప్తి చేశారు.